ప్రభుత్వం నుంచి లబ్ధిని ఆశించకుండా.. తమ కాళ్లపై తాము నిలబడేందుకు పలువురు మహిళలు ఏకమయ్యారు. గ్రామీణ మహిళల్లోని నైపుణ్యాలను వెలికి తీసి.. వారికి జీవనోపాధి కల్పించేందుకు 'మహిళ జీవనోపాధి' అనే ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రణాళిక ప్రకారం.. 150 మందికి పలు వస్తువుల తయారీపై శిక్షణ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ఈ సంఘం సభ్యులు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించి.. సంస్థ భవిష్యత్ కార్యకలాపాలను వివరించారు.
ఆలేరు కేంద్రంగా త్వరలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ - యాదాద్రి భువనగిరి జిల్లా
ఆలేరులో మహిళల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన 'మహిళ జీవనోపాధి సంఘం' హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించింది. మహిళలు తమ నైపుణ్యాలతో.. తయారు చేసిన పలు వస్తువులను ప్రదర్శించింది.
సంస్థ ద్వారా రానున్న రోజుల్లో ఆయుర్వేదిక్, హెర్బల్ మందులను ఉత్పత్తి చేయటంతో పాటు.. ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేకంగా మాస్కులను తయారు చేయనున్నట్లు సభ్యులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం సహజ సిద్ధమైన వస్తువులతో తయారు చేసిన.. బ్యాగ్స్, టీ కప్స్ వంటివి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆలేరు కేంద్రంగా త్వరలో శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో వాటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:రోడ్డు పక్క కూరగాయలు కొన్న మంత్రి సబిత