Revanth team meeting: వరంగల్ రాహుల్ సభ కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీపీసీసీ రేవంత్ రెడ్డి పర్యటనను సీనియర్లు అడ్డుకోవడంపై కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి అవసరం లేదనడంపై వారంతా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వర్గీయులు అద్దంకి దయాకర్, దుబ్బాక నర్సింహారెడ్డి, పున్నా కైలాస్, పల్లె రవికుమార్‌లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి పర్యటనను సీనియర్లు అడ్డుకోవడాన్ని ఖండించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అందోల్ మైసమ్మ దేవస్థానం దగ్గర ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వందమందికిపైగా సమావేశమైన వీరంతా రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కొందరు సీనియర్లు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి వర్గీయులు ఆరోపించారు. వచ్చే నెల 6వ తేదీన వరంగల్‌లో తలపెట్టిన రాహుల్ సభకు జనసమీకరణ కోసం రేవంత్ పర్యటించాల్సి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని స్థానిక నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించి నియోజక వర్గాల వారీగా సమీక్ష చేయాల్సి ఉంది.