యాదాద్రి శ్రీలక్ష్మీసమేత నారసింహస్వామి నిజరూప దర్శనానికి ముహూర్తం దగ్గర్లో ఉన్నందున... పునర్నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి (reconstruction work of the fast progressing). తుది దశ పనులను వచ్చే ఫిబ్రవరిలోపు పూర్తి చేసేందుకు యాడా దృష్టిసారించింది. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి... ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉత్తర, తూర్పు దిశల్లో 40 కోట్ల వ్యయంతో చేపట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కైంకర్యాల కోసం విష్ణుపుష్కరిణిని సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లోగా పుష్కరిణి పనులు సంపూర్తి కానున్నాయి. ఆంజనేయస్వామి మందిరానికి దారి నిర్మితమవుతోంది. గండిచెరువు ప్రాంతంలో దీక్షాపరుల మండలం పూర్తయింది. కల్యాణ కట్ట పనులు 5 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి. లక్ష్మీ పుష్కరిణికి సంబంధించి తుది దశ నిర్మాణం జరుగుతోంది. కొండపైన బస్ బే పనులు చకచకా సాగుతుండగా... కొండ కింద పనులు మొదలు కావాల్సి ఉంది.
తుదిదశ పనులు పూర్తి చేసేలా...
కాలినడకన వచ్చే భక్తుల కోసం మెట్ల దారి, ప్రసాదాల తయారీ సరకుల రవాణాకు అండర్ పాస్‌ను నిర్మిస్తున్నారు. కొండ కింద వైకుంఠద్వారం నుంచి మెట్ల మార్గం రూపుదిద్దుకుంటోంది. శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహణకు గాను స్థల పరిశీలన కోసం చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి రానున్న దృష్ట్యా... తుది దశలో మిగిలిన ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని యాడా నిర్వాహకులు భావిస్తున్నారు.