ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సర్కారీ బడుల్లో 'మధ్యాహ్న భోజన పథకం' కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా తయారైంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రాంపురం ఆదర్శ పాఠశాలలో పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటంతో విద్యార్థులు కడుపు మాడ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
సరిగ్గా ఉడకని అన్నం, చాలీచాలని కూరలు, అచ్చం నీరు లాంటి రసం తినలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. అన్నంలో పురుగుల వస్తున్నాయంటూ ఉపాధ్యాయులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడిలో పెట్టిన అన్నం తినలేక.. కొంత మంది విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తీసుకువస్తున్నారని తెలిపారు.