తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు పూర్తిస్థాయిలో రాని పెట్టుబడి సాయం - పూర్తిస్థాయిలో రాని

రాష్ట్రంలో రైతుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పూర్తికాని భూ దస్త్రాల ప్రక్షాళనతో వేల మంది అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందడంలో సైతం అవకతవకలు జరుగుతున్నాయి.

రైతులకు పూర్తిస్థాయిలో రాని పెట్టుబడి సాయం

By

Published : Jul 4, 2019, 10:12 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో అధికారులకు ఎన్ని ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. వేల మంది రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయానికి దూరమవుతున్నారు. జిల్లాల్లో ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి వందశాతం రెవెన్యూ సమస్యల రహిత గ్రామాలుగా ప్రకటించుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ జిల్లాలో నేటికీ అన్ని మండలాల్లో వేల సంఖ్యలో అన్నదాతలు నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు.

రెవిన్యూశాఖ సమస్య: జ్యోతిర్మయి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
రైతుల భూమి విస్తీర్ణం తదితర అంశాలు రెవిన్యూశాఖ నుంచి రాష్ట్ర వ్యవసాయశాఖ తీసుకొని దాని ఆధారంగా రైతులకు పెట్టుబడి సాయం వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. వ్యవసాయశాఖ పరిధిలో కేవలం రైతుల బ్యాంక్‌ ఖాతా వివరాలను మాత్రమే సరి చేయగల అవకాశం ఉంది. రెండు సీజన్లలో పెట్టుబడి సాయం పొంది ఈ సీజన్‌లో అసలు పెట్టుబడి సాయం అందని రైతుల రెవిన్యూ దస్త్రాల్లో మార్పులు జరిగి ఉండటంతోనే ఈ సమస్య వచ్చింది.

రెండు సీజన్లకు పూర్తిస్థాయిలో వచ్చిన పెట్టుబడి సాయం
జిల్లాలో వందల మంది రైతులకు కొత్త చిక్కు వచ్చి పడింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం మొదటి, రెండో విడతల్లో ఎలాంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో వచ్చిన రైతులకు మూడో విడత పెట్టుబడి సాయంలో కొందరు రైతులకు కోత పడింది. మరికొంత మంది రైతులకు ఏకంగా అసలు పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం లభించడం లేదు.

రూ.90 వేలు నష్టపోయాను
తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన రైతు పాలబిందెల భిక్షం. ఇతడి పేరుతో ఏడు ఎకరాల విస్తీర్ణంలో భూమి పట్టా ఉంది. ఇది ఇతడికి వారసత్వంగా వచ్చిన భూమి కావడంతో మూడు సంవత్సరాల వరకు ఎలాంటి సమస్యలు లేవు. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందడం కోసం అనేక సార్లు అధికారుల చుట్టూ ఫలితం లేదు. వేలి ముద్రలు పడకపోవడంతో ఇప్పటి వరకు నూతన పాస్‌ పుస్తకం మంజూరు కాలేదు. ఫలితంగా పెట్టుబడి సాయం ఇప్పటి వరకు పైసా కూడా అంద లేదు. ఉన్న భూమిని మా కుటుంబ సభ్యుల పేరుకు మార్పు చేయమంటే అధికారులు చేయడం లేదు. చిన్న వేలి ముద్రల సమస్యతో నేను ఇప్పటి వరకు సుమారుగా రూ.90 వేలు నష్టపోయానని భిక్షం వాపోతున్నారు.

రాష్ట్రంలో పలువురు రైతులది ఇదే సమస్య. అధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో ఇలాంటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

ఇదీ చూడండి : తగ్గిన వర్షం... తక్కువగా సాగు

ABOUT THE AUTHOR

...view details