Yadadri Temple News: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా నేటి నుంచి పంచకుండాత్మక యాగం ప్రారంభం కానుంది. మహాకుంభ సంప్రోక్షణకు పూర్వాంగంగా నిన్న అంకురార్పణ చేశారు. స్వస్తి వాచనం ప్రారంభంతో పాటు విష్వక్షేణ పూజ సహా ఇతర క్రతువులు నిర్వహించారు. యాగశాల ప్రవేశం సహా కుంభస్థాపన చేశారు. వారం పాటు సాగనున్న పంచకుండాత్మక యాగ నిర్వాహణకు బాలాలయంలో ఏర్పాటుచేసిన యాగశాలలో సంప్రోక్షణ చేపట్టి ఇప్పటికే గుండాలను సిద్ధం చేశారు.
నలువైపులా ఏర్పాటైన కుండాల మధ్య శ్రీ మహాలక్ష్మి నిర్వహించే యాగానికి పర్యవేక్షకులకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. నిరంతర పారాయణ పఠనానికి 108 మంది పారాయణీకులను సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు యాగం ప్రారంభం కానుంది. సాయంత్రం జరిగే క్రతువుల్లో సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, నిత్య విశేష హోమాలు ఉంటాయి. బాలాలయంలో యాగంతో పాటు ప్రధానాలయంలో మూల మంత్ర జపాలు, పారాయణాలు కొనసాగుతాయి.