యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం - ముగ్దుమ్ పల్లి గ్రామాల మధ్య ఉన్న చిన్న ఏటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి నుంచి వాగుపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జి (కల్వర్ట్ ) మీదుగా నీరు ప్రవహిస్తుండటంతో ఆయా పరిసర గ్రామ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. వాగు పరిసర తండా గ్రామాలు, గుర్రాల దండి, బట్టుగూడెం, పెద్ద రావులపల్లి, పోచంపల్లి గ్రామాలకు చెందిన వారు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే, ఈ చిన్న ఏటి వాగు దాటిరావాల్సి ఉంటుంది.
పొంగినప్పుడల్లా అంతరాయమే..
గ్రామాలకు వెళ్లేందుకు ఇదే దగ్గరి దారి కాగా, చిన్న ఏటి వాగు పొంగినప్పుడల్లా పరిసర గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ ఇబ్బందులను తొలగించడానికి లో లెవల్ బ్రిడ్జి పక్కనే పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.