రేపే ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు Munugode bypoll voting Counting tomorrow: అసెంబ్లీ సమరానికి సెమీ ఫైనల్‌గా ప్రచారం.. నెల పాటు పోటాపోటీగా శ్రమించిన పార్టీలు.. రికార్డుస్థాయి ఓటింగ్లతో ఈవీఎంలలో తీర్పు.. రాష్ట్రంతో పాటు రాజకీయావర్గాల్లో ఆసక్తిరేపుతున్న మునుగోడు ఉపఎన్నిక ఫలితం ఆదివారం వెల్లడి కానుంది. మునుగోడు నియోజకవర్గంలో గురువారం జరిగిన పోలింగ్లో మొత్తం 2లక్షల 41వేల 805 మందికి గానూ.. 2లక్షల 25వేల 192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్అనంతరం ఈవీఎంలను నల్గొండలోని ఆర్జాలబావి వద్ద ఉన్న
వేర్‌హౌసింగ్ గోదాములో స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదట పరిశీలకులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఉదయం ఏడున్నర గంటలకు స్ట్రాంగ్ రూంను తెరిచి.. నమోదైన 686 పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. వీటి లెక్కింపు తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు.
ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడికానుంది. చివరి రౌండ్ ఫలితం ఒంటి గంట వరకు విడుదల అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
మొదటగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూర్, మర్రిగూడం, నాంపల్లి, గట్టుప్పల్.. మండలాల ఓట్లు లెక్కించనున్నారు. తొలిరౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడికానుంది. ఒంటి గంట వరకు చివరి రౌండ్ఫలితం తేలుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశామని నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఉదయం 7.30గంటలకే స్ట్రాంగ్‌రూంను తెరుస్తామని పేర్కొన్నారు.
ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కం రేపుతోంది. నెలరోజుల పాటు మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా మోహరించిన గులాబీదళం.. తమ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. భాజపాలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్.... కాంగ్రెస్సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఉపఎన్నికకు కారణమయ్యారు. వ్యక్తిగతంగా రాజగోపాల్తో పాటు భాజపాకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఉపఎన్నికలో గెలుపుకోసం కమలదళం సర్వశక్తులు ఒడ్డింది. వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికలో తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు తేలనుండటంతో ఫలితాల తీరుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
ఇవీ చదవండి: