Money and liquor in munugode by election: అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించి పార్టీలు హోరాహోరీగా తలపడిన మునుగోడు ఉపఎన్నిక రేపు జరగనుంది. తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారాలు, రోడ్‌షోలతో నియోజకవర్గాన్ని చుట్టేశారు. ప్రచార ఘట్టానికి తెరపడటంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు మునుగోడు నియోజకవర్గం నుంచి తరలివెళ్లారు. కొందరు కీలక నాయకులు ఎన్నికల కోడ్ పరిధిలోకి రాని సరిహద్దు మండలాల్లో మకాం వేశారు. చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో వందలాది కార్లు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు పోటాపోటీగా తాయిలాలు అందించే ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.
ఓటుకు డబ్బు, మద్యం పంపిణీ: ప్రధాన రాజకీయ పార్టీలు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచే నాయకుల కొనుగోలు, ప్రచారానికి భారీ వ్యయం, నిత్యం మద్యం పంపిణీ వంటివి కొనసాగించాయి. ప్రచారపర్వం ముగిసే సమయానికి ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలుపెట్టాయి. మొదట ఒక పార్టీ ఓటుకు మూడువేలు, క్వార్టర్ మద్యం పంపిణీ చేయగా, మరో పార్టీ ఓటుకు నాలుగువేల చొప్పున ఇచ్చినట్లు పల్లెల్లో ప్రచారం జరుగుతోంది. మొదట మూడు వేలు ఇచ్చిన పార్టీ మళ్లీ రెండో దఫా ఇచ్చే అవకాశం ఉందని జనం చర్చించుకుంటున్నారు. నియోజకవర్గానికి బయట ప్రత్యేకించి హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఏ పార్టీ కూడా ఓటర్లందరికీ గంపగుత్తగా సొమ్ము పంపిణీ చేయలేదు. రెండు పార్టీల నుంచి డబ్బులందాయని పలువురు తెలిపారు. మొత్తమ్మీద ఓట్ల కోసమే ఒక్క రోజులోనే కోట్ల రూపాయల పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది.