ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రాంతాలతో పాటు.. రాష్ట్రం నలుదిశలా పరిశ్రమలు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా రాజధానికి 35కి.మీల దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఈ హరిత పారిశ్రామిక పార్కుకు అంకురార్పణ చేసింది. టీఎస్ఐఐసీ, తెలంగాణ పారిశ్రామిక సమాఖ్య భాగస్వామ్యంతో ఈ పార్కును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 1,200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టులో వెయ్యికి పైగా ఎకరాల భూమిని సేకరించగా.. 450 ఎకరాల స్థలం ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో 2 వేల ఎకరాలకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం
పైలాన్‌ను మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. భూములిచ్చిన రైతులను ఆదుకుంటూనే... స్థానికులకే సింహభాగం ఉద్యోగాలు దక్కేలా చూస్తామన్నారు. నలుదిశలా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా... ప్రభుత్వం ఏర్పాటు చేసే నైపుణ్య శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పారిశ్రామిక పార్కు ఆవిష్కరణ పట్ల స్థానిక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వాగతిస్తూనే... ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఉండేలా ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరారు. ఫార్మా, రసాయన పరిశ్రమల వ్యర్థాలతో ఇక్కడ ప్రాంతాలు కలుషితం కాకుండా చూడాలని ఆయన కోరారు.
132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు అంగీకారం