అన్నిరకాల అనారోగ్యాలకు నీరే ప్రాథమిక కారణమని... వీటిని దూరం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 'మిషన్ భగీరథ' పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి గుంతకుంట్ల జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. వాతవరణ మార్పులతో అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని... అందువల్ల పర్యావరణ సమతుల్యత కోసం హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కిడ్నీ బాధితుల కోసం ఆలేరు పట్టణంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం సంతోషంగా ఉందని... దీని నిర్మాణానికి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేసిన కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సెంటర్ నిర్వహణకు ముందుకొచ్చిన భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్‌ను అభినందించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు.