యాదాద్రి లక్ష్మీ నరసింహుని ఆలయ పునర్నిర్మాణ పనులను యాడా వేగవంతం చేసింది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన యాత్రికుల పుణ్యస్నానాల కోసం కొండకింద గండి చెరువు వద్ద లక్ష్మీ పుష్కరిణీ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. సోమవారం సీఎం కేసీఆర్ క్షేత్ర సందర్శన నేపథ్యంలో అన్ని రకాల నిర్మాణ పనులను ముమ్మరం చేశారు. సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు.
హైందవ సంస్కృతి ప్రతిబింబించేలా..
రూ.11.55 కోట్ల వ్యయంతో 2.20 ఎకరాల్లో ఒకేసారి 2500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే వీలుండేలా పుష్కరిణీ ఏర్పాటవుతోంది. దీనిని సంప్రదాయ రీతిలో తీర్చిదిద్దుతున్నారు. స్వాగత తోరణాలు, మండపాల్లో ఒకవైపు హనుమంతుడు, మరోవైపు గరుత్మంతుని విగ్రహాలు, చుట్టూ ప్రహారీ గోడలపై ఐరావతం రూపాలు సిమెంట్‌తో ఏర్పాటు చేస్తున్నారు. హైందవ సంస్కృతి ప్రతిబింబించేట్లు రేలింగ్, ఫ్లోరింగ్ పనులను కొనసాగిస్తున్నారు.