యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటెపల్లిలో నల్ల చెరువు నుంచి మట్టిని కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలో కాటెపల్లిలో గల నల్ల చెరువు నుంచి.. గత రెండు నెలలుగా మట్టిని అనుమతులు లేకుండా గుత్తేదారులు మట్టిన అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని కొండాపూర్, ముత్తిరెడ్డిగూడెం, కాటెపల్లిలలోని ప్రధాన రహదారి పనులు జరుగుతుండగా అక్కడికి ఈ మట్టిని చేరవేస్తున్నారు. చెరువులో సుమారు 30 మీటర్ల లోతు వరకు మట్టిని యథేచ్ఛగా తవ్వుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు అంతలోతు వరకు తవ్వకూడదనే చెబుతున్నాయి. ఆయినప్పటికీ.. గుత్తేదారులు అదేం పట్టించుకోవటం లేదు. కొందరు వ్యక్తులు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై ఈ తతంగం నడిపిస్తున్నారని, అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
'మట్టిని తరలించటానికి అనుమతులు లేవు'
ఈ విషయంపై స్థానిక తహసీల్దార్‌ను వివరణ కోరగా తమ దృష్టికి లేదన్నారు. మట్టిని తరలించటానికి ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా మట్టి తరలింపును చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మట్టి తరలించే స్థలానికి ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డిని పంపించారు.