తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. హరిహర క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నారసింహుని సన్నిధిలో కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ధరలు భారీగా పెంచారని భక్తులు వాపోయారు.
మండుతున్న ధరలు
ఎంతో పవిత్రంగా వెలిగించే కార్తిక దీపాలను దేవస్థానం రూ.30 నిర్ణయించగా... వ్యాపారస్తులు మాత్రం రూ.100 నుంచి రూ.200 విక్రయిస్తున్నారని తెలిపారు. కొబ్బరికాయకు నిర్ణయించిన రూ.30 అమ్మకుండా రూ.100 చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుల స్టాండు రూ.ఐదు ఉండగా ప్రస్తుతం రూ.10 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొండపైన క్యాంటీన్లోనూ ధరలు పెంచారని వాపోయారు.
"దేవస్థాన పరిధిలో ఏది కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. కార్తిక మాసం వల్ల భక్తులు రోజురోజుకూ అధిక సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నారు. దీనిని ఆసరాగా వ్యాపారస్తులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దేవస్థానం నిర్ణయించిన ధరలను గాలికొదిలేశారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తొలినాళ్లలో దేవస్థానం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరుగుతుండేవి."