యాసంగి నాట్లు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో వరి కోతకు వస్తుంది. అయినా.. అధికారులు మాత్రం కిందటి ఖరీఫ్‌కు సంబంధించిన రైతుబంధు సాయం ఇప్పటికీ ఇవ్వలేదు. ఏ ఒక్కరో.. ఇద్దరో.. సాంకేతిక లోపం వల్ల రైతుబంధు అందుకోలేక పోయారంటే.. ఎక్కడో.. ఏదో పొరపాటు జరిగిందని అనుకోవచ్చు. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా 87 వేలమందికి పెట్టుబడి సాయం ఇంకా అందలేదు. వీరందరి పేర్లను ట్రెజరీలో నమోదు చేశారు. ఇందులో.. ఆలేరు నియోజక వర్గంలోని ఎనిమిది మండలాల్లో 11 వేల 925 మంది రైతులకు గత ఖరీఫ్ పెట్టుబడి సాయం అందలేదు. కొంతమందికి యాసంగి సీజన్ పెట్టుబడి సాయం అందినా.. గత ఖరీఫ్‌లో రైతుబంధు అందని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
నియోజకవర్గంలో ఖరీఫ్ 'రైతుబంధు' తీరు
మండలం | రైతులు | జమ అయిన నగదు | అందనివారు |
ఆలేరు | 9,928 | 7, 127 | 1,343 |
గుండాల | 10,913 | 2,964 | 5,328 |
రాజపేట | 11,643 | 8,845 | 1,069 |
తుర్కపల్లి | 11,775 | 9,135 | 755 |
ఆత్మకూరు(ఎం) | 11,362 | 8,748 | 1,230 |
బొమ్మలరామారం | 11,617 | 8,570 | 690 |
మోటకొండూర్ | 9,060 | 7,187 | 839 |
యాదగిరిగుట్ట | 10,720 | 7,558 | 671 |
ఖరీఫ్ రైతు బంధు అందేనా..?
రైతుబంధు పథకంలో ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సొమ్ముగా ఇవ్వగా... జూన్ 1 నుంచి ఎకరానికి మరో వెయ్యి పెంచింది. రైతు బంధు పథకం ప్రభుత్వానికి భారంగా మారడం వల్ల ఇందులో కొన్ని మార్పులు చేయాలని సంకల్పించింది. రైతుబంధు పథకాన్ని గరిష్ఠంగా 10 ఎకరాల లోపు రైతులకు మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఖరీఫ్‌కు సంబంధించి ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి మాత్రమే రైతుబంధు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది.