తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల పాలిట శాపంగా మారిన ఫీడర్‌ ఛానల్‌ కాలువ

యాదాద్రి భువనగిరి తేర్యాలలో ఫీడర్ ఛానల్ కాలువ రైతుల పాలిట శాపంగా మారింది. సుమారు 150 ఎకరాల భూమిని సాగు చేయడానికి 20 మంది రైతులు.. ఈ కాలువ దాటి అవతలకి వెళ్లాలి. అయితే లోతుగా ఉన్న కాలువకు వరద ఎక్కువగా ఉండటం వల్ల అవతలి వైపు దాటలేక పోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల పాలిట శాపంగా మారిన ఫీడర్‌ ఛానల్‌ కాలువ
రైతుల పాలిట శాపంగా మారిన ఫీడర్‌ ఛానల్‌ కాలువ

By

Published : Aug 27, 2020, 1:08 PM IST

యాదాద్రి భువనగిరి మోటకొండూరు మండలం తేర్యాలలో ఫీడర్ ఛానల్ కాలువ రైతుల పాలిట శాపంగా మారింది. సుమారు 150 ఎకరాల భూమిని సాగు చేయడానికి 20 మంది అన్నదాతలు.. ఈ కాలువ దాటి అవతలకి వెళ్లాలి. అయితే గ్రామంలోని చెరువును నింపడానికి ఈ కాలువను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు ఈ కాలువ రెండు ఫీట్ల వెడల్పుతో చిన్నదిగా ఉండేది. నాబార్డు వారు కాలువ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం వల్ల అది కాస్త 5 ఫీట్లు వెడల్పుకు చేరి.. లోతు ఎక్కువైంది. దీంతో వర్షాకాలంలో చిన్నపాటి వాన వచ్చిన కాలువలో ఎక్కువగా వరద వస్తుంది. అటువైపు భూమి ఉన్న రైతులకు దానిని దాటడానికి ఇబ్బందిగా మారింది.

ఫీడర్​ ఛానల్​ కాలువ

గత్యంతరం లేని పక్షంలో ఈ మధ్యన కాలువను పూడ్చారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఆయన సిబ్బంది వచ్చి పూడ్చిన కాలువను.. పునరుద్ధరించాలని, స్థానిక సర్పంచ్‌కు సూచించారు. పూడ్చిన దానిలో మట్టిని జేసీబీ సాయంతో తీయించారు. కోతకు వచ్చిన వరి పంటను కోయడానికి, వరి కోత యంత్రం అటువైపుగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వరి పంట కోతకు రావడం వల్ల రైతులకు ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.

సుమారుగా 100 ఎకరాల్లో ఉన్న పత్తి పంట చూసుకోవడానికి వెళ్లలేక పోతున్నామని వృద్ధ రైతులు తెలిపారు. ఓ రైతు ఎలాగే ధైర్యం చేసి వెళ్తే వరదలో ఓ సారి కొట్టుకుపోయి, ఒడ్డుకు ఉన్న చిన్న చెట్టు కొమ్మను పట్టుకొని అతికష్టం మీద బయటకు వచ్చానని వాపోయాడు. స్థానిక ప్రజా ప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదని రైతులు దిగులు చెందుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఇకనైనా స్పందించి ఈ కాలువలో పైపులు వేసి పై నుంచి మట్టితో పూడ్చి రోడ్డుగా మారితే అందరికీ బాగుంటుందన్నారు.

కాలువ దాటలేక రైతుల అవస్థలు

ఏళ్ల తరబడి ఈ కాలువతో సమస్య రాలేదని లోతు ఎక్కువగా చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని పేర్కొన్నారు. తమ పట్టా భూమిలో నుంచి వెళ్తున్న కాలువ తమ బతుకు దెరువుపై దెబ్బ తీస్తుందని ఎన్నడూ అనుకోలేదని తమ బాధను వెళ్లబోసుకున్నారు.

అధికారుల వివరణ...

ఈ కాలువను తొందర్లోనే పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని మండల ఏఈ అశోక్ ఆనంద్ హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సాధ్యమైతే ర్యాంపును ఏర్పాటు చేస్తామని.. లేదంటే మరో మార్గం చూస్తామని పేర్కొన్నారు. చెరువులు నిండాలంటే కాలువలు తప్పనిసరి అని.. అది అన్నదాతలు అర్థం చేసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి :వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details