Etala Rajender criticized KCR: కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సామాన్యుడు ఎన్నికల్లో పోటీచేయలేని పరిస్థితి దాపురించిందని భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లే పరిస్థితిని తెరాస తీసుకువచ్చిందన్నారు. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని 12 మంది ఎమ్మెల్యేలను తెరాస పార్టీలో కలుపుకున్నారని విమర్శించారు. కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల కోసం వందల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారని ఈటల ప్రశ్నించారు.
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టింది కేసీఆర్ అని గుర్తించాలని హితవు పలికారు. కమ్యూనిస్టు పార్టీలను 9 ఏళ్లపాటు ప్రగతిభవన్‌లో ప్రవేశించకుండా చేశారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి వామపక్షాలు ఎప్పుడైన ప్రగతిభవన్‌కు వెళ్లి అడిగాయా అని నిలదీశారు. రైతాంగం వద్ద వడ్లను కొనకుండా ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టింది ముఖ్యమంత్రి కాదా అని అన్నారు. సీఎం మోసపురిత మాటలు నమ్మొద్దని మునుగోడు ప్రజలను ఆయన కోరారు.