లాక్‌డౌన్ నేపథ్యంలో భక్తులెవరూ యాదాద్రికి రావొద్దని దేవస్థానం అధికారులు విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో దర్శనాలు, మొక్కు పూజలను ఈ నెల 30 వరకు నిలిపివేయాలని దేవస్థానం నిర్ణయించింది. గురువారం దీనిపై ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు దేవస్థానం ప్రధాన కార్యాలయం అధికారులు తెలిపారు. స్వామివారికి ఏకంత సేవలను అర్చకులు చేపడుతున్నారు.
వనరుల కల్పనకు ఏర్పాట్లు..
యాదాద్రి ఆలయంలో ప్రతిరోజూ సుమారు 12 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో వనరులను సమకూర్చేందుకు యంత్రాంగం శ్రమిస్తోంది. ఆ దిశగా సదరు పనులకు యాడ యంత్రాంగం సన్నాహాలు చేపడుతోంది. మిషన్ భగీరథ నీటిని అంతమేరకు సరఫరా చేయడానికి వైటీడీఏ సన్నాహాలు చేస్తోంది.
ఇదివరకు రోజుకు 10 లక్షల లీటర్ల నీరు అవసరమయ్యేది. భవిష్యత్తులో పెరగనున్న భక్తుల సంఖ్య.. వివిధ అవసరాల దృష్ట్యా మరో 2 లక్షల లీటర్లు అదనంగా అవసరమని అంచనా.. ఇప్పటికే అధికారులు తులసి కాటేజీలో సుమారు 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపును నిర్మించారు. భగీరథ పైపుల ద్వారా వచ్చిన నీటిని ముందుగా ఈ సంపులోకి పంపిన తర్వాత ఆలయానికి సరఫరా చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇవీ చూడండి:పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్