యాదాద్రి భువనగిరి జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు సరైన దిగుబడి రాక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,81,147 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేయగా, 1,44,914 టన్నుల పత్తి దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ సెప్టెంబరులో కురిసిన అధిక వర్షాలతో పత్తి పంటకు నష్టం వాటిల్లడంతో దిగుబడి తగ్గడమే గాక పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
జిల్లాలోని వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్, నారాయణ పూర్, గుండాల, మోట కొండూర్, అడ్డగూడూర్ మండలాల్లో రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జూన్, జులైలో విత్తనాలు నాటి పంట ఎదిగే క్రమంలో ఆగష్టు చివరి నాటికి వర్షాలు అనుకున్న మేర కురవలేదు. సెప్టెంబర్ చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో పత్తి పూత.. కాసే దశకు చేరుకున్న తరుణంలో పూత రాలిపోయింది. వరద కాల్వలు తెగిపోయి సమీపంలో ఉన్న పత్తి పంట నీటమునిగి పంటలు దెబ్బతిన్నాయి. జాజు తెగులు, గులాబీ పురుగు.. పత్తి దిగుబడి తగ్గిపోవడానికి కారణాలయ్యాయి.