ప్రగతిశీల, ప్రజా ఉద్యమాల బాటలో నడిచిన కామ్రేడ్ దూడల వెంకన్న... విప్లవోద్యమాలలో చిరంజీవిగా ఉంటారని యాదాద్రి భువనగిరి జిల్లా పీవైఎల్ కార్యదర్శి బేజాడి కుమార్ అన్నారు. వెంకన్న 31వ వర్ధంతిని ఆలేరు పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించారు. వెంకన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి పీవైఎల్ నాయకులు విప్లవ జోహార్లు తెలిపారు.
కామ్రేడ్ కట్టా నర్సింహా రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ ఆలేరు విప్లవోద్యమంలో వెంకన్న చురుగ్గా పాల్గొన్నారని బేజాడి అన్నారు. ప్రగతిశీల ఉద్యమాలు చేస్తూ యువకులతో కలిసి పోరు నడిపారని, నూతన ప్రజాస్వామిక విప్లవ పోరాటంలో ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు.
ఆలేరు ప్రాంత భూస్వామ్య శక్తులు, పాలక పార్టీలు.. ప్రజా వ్యతిరేకులు, రాడికల్స్‌ను చేరదీసి 1989లో నర్సన్న, వెంకన్న తదితర అనేక మంది విప్లవ ప్రజా నాయకులను హత్యచేశారని కుమార్ ఆరోపించారు. నేడు కేంద్రం, రాష్ట్రంలో పాలకులు పూర్తిగా ప్రజావ్యతిరేక పాలనను అమలు చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రైతులు, వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడానికి ప్రధాని మోదీ... స్వేచ్ఛ మార్కెట్ పేరుతో సంస్కరణలు ముందుకు తెస్తే, ఎల్ఆర్ఎస్ పేరుతో సీఎం కేసీఆర్ పేద కుటుంబాల దోపిడీకి సిద్ధపడ్డారని విమర్శించారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను బట్టబయలు చేయడానికి పోరుబాటలో నడవాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:జియాగూడలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రులు