నెలరోజుల వ్యవధిలోనే రెండోసారి వరంగల్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.... పలు ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. గత నెల 21న ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ బాధితులను పరామర్శించిన కేసీఆర్... రోగుల తాకిడికి తగ్గట్లుగా ఆస్పత్రి సరిపోవట్లేదని గుర్తించారు. ఈ క్రమంలోనే కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అవసరమని భావించి.... వరంగల్ జైలు ప్రాంగణాన్ని సందర్శించారు. కారాగార ప్రాంతంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని సీఎం నిర్ణయించారు. 56 ఎకరాల్లో నిర్మించనున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.... గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లకు దీటుగా..... సర్కారీ దవాఖానల్లో అతి పెద్దదిగా నిలవనుంది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోద ముద్ర లభించడంతో... ఆస్పత్రి నిర్మాణానికి వేగంగా అడుగులు పడ్డాయి. జైలులోని ఖైదీలను పక్షం రోజుల్లోనే వివిధ ప్రాంతాలకు తరలించి... తర్వాత భవనాలను పడగొట్టి చదును చేశారు. 30 అంతస్తుల ప్రతిపాదనతో చేపట్టనున్న ఈ ఆస్పత్రికి... జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్నారు.
కాకతీయుల ఘన కీర్తిని చాటేవిధంగా
ఆస్పత్రికి భూమిపూజ అనంతరం... వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు ఒకే చోట ఉండేలా ఈ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. చుట్టూ ఆహ్లాదం గొలిపే పచ్చదనం, సూర్యరశ్మి ధారాళంగా వచ్చే విధంగా విశాలమైన గదులు, సమావేశ, దృశ్యమాధ్యమ మందిరాలు సకలసదుపాయాలతో వందేళ్లైనా చెక్కుచెదరని విధంగా కొత్త కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. కాకతీయుల ఘన కీర్తిని చాటేవిధంగా...కలెక్టరేట్ భవనం ముందు కొలువుతీరిన కళాతోరణం...చూపరుల కనువిందు చేస్తోంది. కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం.... వరంగల్ కేంద్రంగా నెలకొల్పిన ఆరోగ్య విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం, తెలంగాణకు వైద్యవిశ్వవిద్యాలయం ఉండాలని భావించి.... ప్రజాకవి కాళోజీ గౌరవార్థం ఆయన పేరుతో కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
5 అంతస్తుల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయం
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్... 2016 ఆగస్టు 7న ఆరోగ్య విశ్వవిద్యాలాయానికి శంకుస్థాపన చేశారు. నాటి నుంచి కేఎంసీ ప్రాంగణంలోని... చిన్న భవనంలో కార్యకలాపాలు నడుస్తుండగా... నేడు నూతన భవనంలోకి మారుతోంది. ఐదెకరాల్లో 25 కోట్ల రూపాయల వ్యయంతో... 5 అంతస్తుల్లో నిర్మించిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కొత్త భవానాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కాళోజీ ఏడున్నర అడుగుల కాంస్య విగ్రహంతోపాటు... ప్రాచీన వైద్యశాస్త్ర ప్రముఖుల ప్రతిమలను విశ్వవిద్యాలయం ముందు అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా..... నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వ పథకాలు తెలిపేవిధంగా.. బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలను ముగించుకున్న తరువాత.. మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఇంటికి వెళ్లనున్న సీఎం... అక్కడ భోజనానంతరం... యాదాద్రి జిల్లాకు బయలుదేరతారు.