తెలంగాణ

telangana

ETV Bharat / state

సారు రాక కోసమే.. ఆ పల్లె ఎదురుచూస్తోంది - కేసీఆర్​ తాజా వార్తలు

ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రిపై... అధికారుల నివేదిక సిద్ధమైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పల్లెకు సంబంధించిన సమగ్ర సర్వేను... ఇప్పటికే పూర్తి చేశారు. అభివృద్ధి ప్రణాళికపై నివేదికను జిల్లా యంత్రాంగం రూపొందించగా... ముఖ్యమంత్రి కేసీఆర్​ రాక కోసం ఊరు ఎదురుచూస్తోంది.

సారు రాక కోసమే.. ఆ పల్లె ఎదురుచూస్తోంది
సారు రాక కోసమే.. ఆ పల్లె ఎదురుచూస్తోంది

By

Published : Jan 6, 2021, 11:17 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి... ముఖ్యమంత్రి రాక కోసం ఎదురుచూస్తోంది. తాను దత్తత తీసుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటనతో... జిల్లాలోని అన్ని శాఖలు ఊరిని సందర్శించాయి. చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించాయి. సీఎం ఆదేశాలతో కలెక్టర్ అనితారామచంద్రన్... గత నెలలోనే సమగ్ర సర్వే పూర్తి చేయించారు. వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించేందుకు... జిల్లా యంత్రాంగం గడప గడపకు వెళ్లి వివరాలు సేకరించింది. గ్రామ పర్యవేక్షణకు గాను డీఆర్డీవో మందడి ఉపేందర్ రెడ్డికి ప్రత్యేకాధికారిగా బాధ్యతలు అప్పగించారు. గ్రామస్థుల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలపై అధ్యయనం చేసిన సర్కారు విభాగాలు... కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నాయి. రాష్ట్రస్థాయి అధికారులు కూడా గ్రామంలో పర్యటించి లోటుపాట్లు లేని రీతిలో నివేదికను తయారు చేశారు.

ఇవీ కావాల్సినవి..

వాసాలమర్రి వాసుల ఆర్థిక, సామాజిక, వ్యవసాయ స్థితిగతులు సహా జీవన ప్రమాణాలపై వివిధ విభాగాలు అంచనాలు రూపొందించాయి. సీసీ రహదారులు, మురుగు కాల్వలు, వైద్యం, విద్యుత్తు, విద్య, యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యలపై... నివేదిక తయారైంది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోగా... అన్ని హంగులతో సమీకృత గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి... మహిళా సమాఖ్యతోపాటు గ్రంథాలయం సౌకర్యం అందులోనే కల్పించాలని చూస్తున్నారు. రెండు పడక గదుల ఇళ్లు, ఆరోగ్య ఉప కేంద్రం, స్వయం ఉపాధిలో భాగంగా పాడి గేదెలు, ట్రాక్టర్ల అవసరముందని అధికారులు తేల్చారు.

హామీతో సంతోషం

అంకాపూర్, ఎర్రవెల్లి తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి మాటతో... గ్రామస్థుల్లో ఆనందం కనిపిస్తోంది. నవంబరులో గ్రామస్థుల్ని తన వ్యవసాయ క్షేత్రానికి పిలిపించుకున్న కేసీఆర్... అవసరాన్ని బట్టి 50 నుంచి వంద కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఓఎస్టీ ప్రియాంక వర్గీస్ పర్యటించిన తర్వాత జిల్లా యంత్రాంగం... నెల రోజుల పాటు సమగ్ర సర్వే నిర్వహించింది. చెరువులను పునరుద్ధరించి, వాసాలమర్రిని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలన్న ప్రతిపాదనలున్నాయి. ఈ నెల రెండో వారంలో ముఖ్యమంత్రి తమ గ్రామానికి వస్తారన్న ఆశాభావంతో స్థానికులు ఉన్నారు.

ముఖ్యమంత్రి రాకకోసం

ముఖ్యమంత్రి హామీతో ఇంతకాలం వలస బాటి పట్టిన స్థానికులు... గ్రామంలోనే కాలం గడుపుతున్నారు. హైదరాబాద్​కు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసాలమర్రి... సీఎం ఆదేశాలతో ఇప్పటికైనా అభివృద్ధి దిశగా పయనిస్తుందని గ్రామస్థులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:అతని డ్రైవింగ్‌తో నా ప్రాణాలు పోతాయనుకున్నా...

ABOUT THE AUTHOR

...view details