యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చిన్న మేడారం జాతర ప్రారంభమైంది. నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన చిన్న మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటే అనుకున్నవి జరుగుతాయని భక్తుల నమ్మకం. జనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఏర్పాట్లు చేశారు. జాతరను మెదక్, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సుమారు 3నుంచి 4లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారు.
జాతర ఇలా..
గత బుధవారం సంప్రదాయబద్ధంగా నిర్వాహకులు బూర్గుపల్లి నుంచి మేళతాళాలతో జల కడవలను తీసుకువచ్చారు. ఇవాళ బూర్గుపల్లి గిరిజనులు ఎల్లమ్మ బోనాలతో జాతర ప్రారంభిస్తారు. అనంతరం కుర్రారం గ్రామస్తులు ఎల్లమ్మ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 5వ తేదీన సారలమ్మ, 6న సమ్మక్క వనదేవతలను గద్దెలపైకి తీసుకొస్తారు. ఏడో తేదీన మొక్కులు చెల్లించుకుంటారు. ఎనిమిదో తేదీన సమ్మక్క, సారలమ్మలు తిరిగి వన ప్రవేశం చేస్తారు.
చిన్న మేడారంలో జరుగుతున్న జాతర పనులను ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, అధికారులు పరిశీలించారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అమె తెలియజేశారు.
చిన్న మేడారంను సందర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సరఫరా, పార్కింగ్, ప్రాథమిక చికిత్స సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత అధికారులను ఆదేశించారు.
ఇదీ రాజాపేట చిన్నమేడారం కథ..!