Reasons for BJP defeat in the munugode bypoll: దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపుతో జోష్‌లో ఉన్న కాషాయ పార్టీ మునుగోడులో చతికిలపడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ ఉనికి కాపాడుకోవడానికి కమలనాథులు వేసిన వ్యూహం బెడిసికొట్టింది. మునుగోడులో భాజపా ఓటమికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు చెబుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం.. అమిత్ షా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోవడం.. ఆ వెంటనే ఉప ఎన్నిక రావడం చకచకా జరిగిపోయాయి.
ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా ఇంఛార్జ్ అని కాకుండా రాష్ట్ర నాయకత్వం చేసిన జంబో స్టీరింగ్ కమిటీ ప్రయోగం విఫలమైంది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ఇంఛార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవహరించారు. ఈ ఎన్నికలో జంబో స్టీరింగ్ కమిటీకి ఛైర్మన్ గా వివేక్‌ను, సమన్వయ కర్తగా గొంగిడి మనోహర్ రెడ్డి, సభ్యులుగా ఈటల రాజేందర్, మాజీ మంత్రి చంద్రశేఖర్ , స్వామి గౌడ్, దాసోజ్ శ్రవణ్ ను నియమించింది. ఉప ఎన్నిక వ్యహాల రూపకల్పనలో పాల్గొన్న స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ తెరాస పార్టీలో చేరిపోయారు. దీంతో భాజపా వ్యూహాలు తెరాసకు లీక్ అయిపోయాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.
కమలనాథులు ఆలస్యంగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారపర్వంలోకి దిగడం.. ప్రచారంలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీ ఓటమికి కారణంగా తెలుస్తోంది. పలువురు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత తగాదాలు మునుగోడు ప్రచారంపై ప్రభావం చూపించాయి. భాజపా మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌గా వివేక్ వ్యూహాలను అమలు చేయడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఆరోపణలను తిప్పికొట్టలేకపోవడం.. కార్యకర్తలకు బంగారం పంచుతారనే ప్రచారం భాజపాకి మైనస్‌గా మారింది.
ఇక పోల్ మేనేజ్మెంట్లో కమలనాథులు ఘోరంగా దెబ్బతిన్నారు. చౌటుప్పల్, చండూరు, మునుగోడు మండలాల్లో మేజార్టీ వస్తుందని ఆశించి భంగపడ్డారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో స్వల్ప మెజార్టీ.. 2, 3 రౌండ్లలో మాత్రమే భాజపాకి దక్కింది. మిగతా అన్ని రౌండ్లలో గులాబీ గుబాళించి, కాషాయం వికసించలేకపోయింది. ఓటమి చవిచూసిన కాషాయ దళం కారు స్పీడుకు బ్రేకులు వేస్తూ గట్టి పోటీని మాత్రం ఇవ్వగలిగింది. మునుగోడు భాజపా సీటు కాదని.. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదని.. ఇప్పుడు గట్టిపోటీ ఇచ్చామని కమలనాథులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు తామే ప్రత్యామ్నాయమని కాషాయ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి: