ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 203 జీవో అమలైతే దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సీఎం కేసీఆర్ మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. పోతిరెడ్డిపాడు నిర్మాణం జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు విషయంపై ప్రధాని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి... దక్షిణ తెలంగాణకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తానని తెలిపారు.
'203 జీవోను వెంటనే రద్దు చేయాలి. ఈ జీవో వల్ల దక్షిణ తెలంగాణలో నాలుగు జిల్లాలను ఎడారిగా మార్చే జీవో అది. వారికిచ్చిన వాటా కాకుండా తెలంగాణకు ఇచ్చిన వాటాను వాడుకునేలా జీవోను తీసుకొస్తే ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరం. కాళేశ్వరంతో మొదలైన ప్రాజెక్టులైన దిండి, బ్రహ్మణవెల్లంల, పాలమూరు తదితర ప్రాజెక్టులు కేవలం తొమ్మిది శాతం పనులే పూర్తయ్యాయి. ఈ సమస్యకు సంబంధించి దక్షిణ తెలంగాణలోని మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి. లాక్డౌన్ ఎత్తివేయగానే ప్రధాని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిస్తాం. ఏపీలో పని మొదలైతే ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు. దీనపై తప్పకుండా సుప్రీంకోర్టులో పోరాటం చేస్తా'.-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ
ఇవీ చూడండి: తడిసిన నయనం.. ఆగని పయనం