భూదాన్ పోచంపల్లి గ్రామానికి ఉత్తమ పర్యాటక గ్రామం అవార్డును ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అందించింది. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో యూఎన్‌డబ్ల్యుటీవో అధికారులు ఈ అవార్డు ప్రధానం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో దృశ్యమాధ్యమ సమావేశంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. భారత దేశం తరుపున స్పెయిన్ భారత రాయబార కార్యాలయం రెండవ కార్యదర్శి సుమన్ శేఖర్ అవార్డును స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ పర్యాటక రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఏడేళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ టూరిజం విలేజ్‌గా భూదాన్ పోచంపల్లిని ఎంపిక చేసి అవార్డు అందించడంపై మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. 75 దేశాల నుంచి వచ్చిన 170 దరఖాస్తుల ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో పోచంపల్లి ఎంపిక కావడం గ్రామం యొక్క అత్యుత్తమ విలువలు, చర్యలకు ఒక స్పష్టమైన నిదర్శనమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రపంచ పర్యాటక గ్రామంగా..
ప్రపంచ పర్యాటక గ్రామంగా..గ్రామీణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ పర్యాటక గ్రామం పోటీ నిర్వహిస్తుంది. సాంఘిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో సుస్థిరాభివృద్ధి ఉందా..? గ్రామీణ సాంస్కృతిని ఎలా పరిరక్షిస్తున్నారు. గ్రామీణ పర్యాటకానికి ఎంత అవకాశముంది..! ఇలా మొత్తం 9 అంశాలు పరిగణనలోకి తీసుకొని.. అందుకు అర్హత ఉన్న గ్రామాలను ఆ జాబితాలో పొందు పరుస్తారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించటం, సంప్రదాయాల పరిరక్షణ, వాటిని భావితరాలకు అందించటం, ఆర్థిక అసమానతలు రూపుమాపటం ఈ పోటీ ఉద్దేశం. అత్యుత్తమ విధానాలు అవలంబిస్తూ గ్రామీణ గమ్యస్థానాలుగా మారిన ప్రాంతాలకు ఉత్తమ పర్యాటక గ్రామాల అవార్డులు ఇస్తారు. భూదాన్ పోచంపల్లి గ్రామం ఈ అన్ని అంశాలకూ అనుగుణంగా ఉండటం వల్ల ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.
పోచంపల్లిలో 65 శాతం చేనేత కార్మికులే..
హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని భూదాన్ పోచంపల్లి గ్రామ ప్రజల (Bhoodan Pochampally speciality) ప్రధాన వృత్తి చేనేత. టై అండ్ డై విధానంలో రంగురంగుల డిజైన్‌లతో చీరలు, వస్త్రాలు తయారు చేయడంలో దిట్టలైన ఇక్కడి చేనేత కళాకారుల పనితనం ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇక్కత్ శైలిలో నేసే చీరలకు 2004లో భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది. ఇప్పుడు పర్యాటక గ్రామంగా ఎంపిక కావటం వల్ల మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించనున్నాయి. ఫలితంగా విదేశీయుల రాకపోకలు పెరిగి పోచంపల్లి.. ఖండాంతర ఖ్యాతి గడించనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,294 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ ఉంటే, అందులో సగం భూదాన్ పోచంపల్లిలోనే ఉన్నాయి. గ్రామంలో జనాభాలో 65 శాతం మంది చేనేత కార్మికులే ఉన్నారు. జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల్లో అత్యధికం ఇక్కడి వారే.
అప్పటి నుంచి భూదాన్ పోచంపల్లిగా..