Funds Problem for BB Nagar AIIMS: ఎయిమ్స్ అనగా ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ. అత్యుత్తమ వైద్యనిపుణులు, అంకితభావంతో పనిచేసే సిబ్బంది, ఏమాత్రం విదేశాలకు తీసిపోని మౌలిక వసతులకు నెలవు. పేదవాడి నుంచి మొదలుకొని రాష్ట్రపతి వరకు ఎవరు అనారోగ్యం పాలైనా తొలి ఎంపిక ఎయిమ్స్ అనడంలో సందేహం లేదు. అలాంటి సకల వసతులు ఉన్న ఎయిమ్స్ రాష్ట్రానికి మంజూరు కావడంతో ప్రజలు ఎంతో సంతోషించారు. ఇందుకోసం భాగ్యనగరానికి అతి సమీపంలోని బీబీనగర్‌ను ఎంపిక చేయడంతో తమకు ఉత్తమ వైద్య సేవలు అందుతాయని అంతా ఆశించారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు. 2019లో ప్రారంభమైనా ఇప్పటివరకు ఎయిమ్స్ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోలేదు.
తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఎయిమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం శీతకన్నేసింది. బీబీనగర్‌కు భారీగా నిధులు కేటాయించినా ఇప్పటి వరకు అరకొరగానే నిధులు విడుదల చేసింది. దీంతో ఎయిమ్స్ నిర్మాణం పూర్తి కాలేదు. దేశంలో 2014 తర్వాత మంజూరైన ఎయిమ్స్‌లలో తెలంగాణకే అతి తక్కువగా నిధులు వచ్చాయని తాజాగా మరోసారి ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ)కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా వెల్లడైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఎయిమ్స్ ప్రాజెక్టుల స్థితిగతుల గురించి విజయవాడకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు కింద పెట్టుకున్న ఆర్జీ కింద దేశంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ సంస్థలకు విడుదల చేసిన నిధుల వివరాలు సదరు వ్యక్తికి వెల్లడించారు.