Ayurvedic Industry : స్థానికంగా లభించే వాటితో నాన్నమ్మ చేసుకునే మూలికల్ని ఆసక్తిగా గమనించేవాడు ఈ యువకుడు. అలా చిన్నతనంలో ఆ రంగంపై మక్కువ ఏర్పడుచుకున్నాడు. మెుదట ఉత్పత్తులను సేకరించి అవసరమైనవారికి సరఫరా చేశాడు. కొనుగోలు, అమ్మకంతో వచ్చిన లాభాలు పెట్టుబడిగా పెట్టి బొటానిక్ హెల్త్‌కేర్ పరిశ్రమ స్థాపించాడు. ప్రస్తుతం రూ.400 కోట్ల టర్నోవర్‌తో 400 మందికి ఉపాధి ఉపాధి కల్పిస్తున్నాడు ఈ యువ వ్యాపారవేత్త.
హెల్త్‌కేర్ పరిశ్రమ స్థాపించిన ఈ యువకుడి పేరు సౌరవ్ సోని. హిమాచల్‌ప్రదేశ్ హీరానగర్ అనే చిన్న గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. పాడిపంటలు చూస్తూ, చేల గట్లపై తిరుగుతూ పెరిగాడు. హైస్కూలు వరకు ఊళ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ప్లస్ టూ తర్వాత ఎంబీబీఎస్‌లో సీటు రాకపోవడంతో బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బయోటెక్‌లో బీటెక్ పూర్తి చేశాడు.
నాన్మమ్మే స్ఫూర్తి: సౌరవ్ చిన్నతనంలో నాన్నమ్మతో ఎక్కువగా ఉండేవాడు. ఆమె తన ఆరోగ్యం కోసం బ్రాహ్మి, త్రిఫల, ఉసిరి, అల్లనేరేడు పండ్లు, స్థానికంగా లభించే ఆకులు అలములు వాడేవారు. ఇంట్లోనే రోలులో మూలికలు దంచడం, నూరడం ఆసక్తిగా గమనించేవాడు సౌరవ్ . ఏ అనారోగ్యం ఉన్నా ఆమె ఆయుర్వేద ఔషధాలతో నయం చేసుకునేదని, అలా చిన్నతనంలో ఆయుర్వేదంపై తనకు మక్కువ ఏర్పడిందని చెబుతున్నాడు.
చదువుకోసం విదేశాలకు వెళ్లి.. తిరిగి భారత్‌కు వచ్చాడు సౌరవ్. నాన్నమ్మను ప్రేరణగా తీసుకుని 2013లో ఆయుర్వేద ఔషధాల అమ్మకాలు ప్రారంభించాడు. అలా మెుదట చైనా నుంచి ఆయుర్వేద ఉత్పత్తులు దిగుమతి చేసుకుని అవసరమైనవారికి సరఫరా చేసేవాడు. కొనుగోలు, అమ్మకంతో వచ్చిన లాభాలు పెట్టుబడిగా పెట్టి.. అంచెలంచెలుగా వ్యాపారం విస్తరణ చేశాడు.
రైతుసంఘాలతో భాగస్వామ్యం: 2020లో కేరళకు చెందిన మధు కృష్ణమణితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా తాళ్ల సింగారంలో పరిశ్రమ ప్రారంభించాడు సౌరవ్. దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు, రైతుసంఘాలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాడు. రైతులకు అవగాహన కల్పించి, ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ, శాస్త్రీయ పద్దతులతో సాగు చేసేలా ప్రోత్సాహించాడు.