Architect Usha Raghuveer Reddy :ప్రత్యేక రాష్ట్రం సిద్ధించక ముందు ఏదైనా ఒక పనికోసం వెళ్లాలంటే ప్రజలకు వివిధ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. అలా వెళ్లడం భారంగా మారడంతో అన్నిరకాల కార్యాలయాలు ఒకదగ్గర ఉంటే మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావించింది. తద్వారా పాలన ప్రజలకు చేరువ అవుతుందని గుర్తించింది. అందులోభాగంగా.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సమీకృత కలెకరేట్ల నిర్మాణం చేపట్టింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టేలా నిర్మాణాలు తలపెట్టింది. ఇప్పటికే కొన్నిచోట్ల సమీకృత కలెక్టరేట్లు అందుబాటులోకి రాగా.. త్వరలోనే అన్ని జిల్లాలో ప్రారంభించేలా అడుగులు వేస్తోంది.
new collectorates in Telangana : ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో.. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా.. విశాలమైన విభిన్న ఆకృతులతో కొత్త కలెక్టరేట్ భవనాలు దర్శనమిస్తున్నాయి. సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టిసారించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వాటి నిర్మాణాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆకట్టుకునేలా, సౌకర్యంగా ఉండేలా నిర్మించాలని భావించారు. కలెక్టరేట్ల డిజైన్లు రూపొందించే అవకాశం.. యాదాద్రి జిల్లా మోటకొండురూ మండలం చాడ గ్రామానికి చెందిన.. ఆర్కిటెక్ ఉషారఘువీర్‌రెడ్డికి ఇచ్చారు. 1971లో అమెరికాలో ఆర్కిటెక్చర్ పూర్తిచేసిన ఆమె.. 1986లో హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించి వివిధ భవనాలకు ఆర్కిటెక్‌గా పనిచేశారు. అటవీశాఖ అధికారి చొరవతో.. ఉషారఘువీర్ డిజైన్ చేసిన భవనాలను పరిశీలించిన సీఎం.. కలెక్టరేట్ల బాధ్యతను ఆమెకు అప్పగించారు. కలెక్టరేట్ నిర్మాణాల ఆకృతులపై సీఎం సుదీర్ఘ అధ్యయనం చేశారని.. ఆ తర్వాతే తన ఆకృతులకు పచ్చజెండా ఊపారని ఉషారఘువీర్ తెలిపారు.