Yadadri Brahmosthavam 2023: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయ ఉద్ఘాటన అనంతరం తొలిసారి జరుగుతోన్న ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. మాఘ శుద్ధ పాడ్యమిన స్వస్తివాచనం, అంకురారోపణం, విష్వక్సేన ఆరాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 3 వరకు అత్యంత వైభవోపేతంగా సాగే వేడుకల్లో 27న ఎదుర్కోలు, 28న స్వామివారి తిరుకల్యాణోత్సవం, మార్చి ఒకటిన దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Yadadri Temple Annual Brahmosthavam 2023: బ్రహ్మోత్సవాల్లో భాగంగా అలంకార సేవలు 23న ఉదయం 9 గంటలకు మత్స్యాలంకారంతో ప్రారంభం కానున్నాయి. మార్చి 1న మహా విష్ణువు అలంకారంపై గరుడ వాహన సేవతో సేవలు ముగుస్తాయి. మొదటి ప్రాకార మండపంలో స్వామివారి సేవలను అలంకరించనున్నారు. అనంతరం సేవలను ఉత్తర రాజగోపురం గుండా మాఢవీధుల్లో ఊరేగిస్తారు. అక్కడి నుంచి తూర్పు రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన ఆస్థానం వద్ద భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అక్కడి నుంచి దక్షిణ భాగం మాఢవీధుల గుండా పశ్చిమ రాజగోపురం, ఉత్తర గోపురం నుంచి సేవను లోపలికి ప్రవేశింపజేస్తారు.
కల్యాణోత్సవంలో సీఎం దంపతులు..:ప్రధానాలయంలో ఈ నెల 28న జరిగే తిరు కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. సీఎం దంపతులతో పాటు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దంపతులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని వివరించారు.
నిత్యహోమం, కల్యాణం నిలిపివేత..: వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ 11 రోజుల పాటు భక్తులు చేపట్టే నిత్యహోమం, కల్యాణోత్సవాన్ని నిలిపివేసినట్లు గీతారెడ్డి తెలిపారు. మార్చి 4న పునః ప్రారంభం కానున్నాయని.. భక్తులు సహకరించాలని కోరారు.