యాదాద్రి భువనగరిజి జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మోత్కూరు మండలంలో మంగళవారం ఒక్కరోజే 18 పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టు పక్కల మండలాల్లో సైతం.. రోజుకు పదుల సంఖ్యలో కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మోత్కూరు మండలంలోని పొడిచెడులో 12, పాటిమట్ల1, మూషిపట్ల 1, మోత్కూరు మండల కేంద్రంలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. పొడిచెడు గ్రామంలో ఒకేరోజు 12 కేసులు నమోదు కావడం వల్ల గ్రామంలో సంపూర్ణ లాక్డౌన్ విధించినట్టు సర్పంచ్ పేలపూడి మధు తెలిపారు. గ్రామస్థులకు కావాల్సిన సరుకులు గ్రామ పంచాయతీ సిబ్బంది అందిస్తారని తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మోత్కూరులో ఒకేరోజు 18 పాజిటివ్ కేసులు!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలో మంగళవారం ఒక్కరోజే.. 18కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మోత్కూరు మున్సిపాలిటీ, ఇతర మండలాల్లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఒకేరోజు 12 మంది కొవిడ్ బారిన పడడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.
గ్రామంలో ఉన్నట్టుండి ఇంతమందికి కరోనా ఎలా వచ్చిందని ఆరా తీస్తున్నట్టు సర్పంచ్ తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నార్కట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ పాల ఉత్పత్తి కేంద్రంలో పని చేస్తారని, వారి వ్యవసాయ క్షేత్రంలో కూలికి వెళ్లిన వారికి సైతం కరోనా వచ్చిందని.. వారి వల్లే గ్రామంలో ఇంతమందికి కరోనా వచ్చిందని భావిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మోత్కూరు ఎస్సై ఉదయ్ కిరణ్ పొడిచేడు గ్రామంలో పర్యటించి ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ముఖానికి మాస్కు లేకుండా ఎవరూ బయటకు రావద్దని కోరారు. పొడిచెడు గ్రామ ప్రజలు పక్క గ్రామాలకు వెళ్ళకూడదని.. ఇతర గ్రామ ప్రజలను మీ గ్రామములోకి రానీయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఎవరికైనా దగ్గు, జలుబు, వంటినొప్పులు, జ్వరము, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే మోత్కూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. వ్యాధి రాకముందే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి : ఒకప్పుడు ఆటలో మేటి.. విధి వక్రించి బతుకు భారమైంది!