Young Man Suicide in Warangal District : తమకున్న కాసింత పొలంలో వరి పంట వేశారు. చేతికొచ్చిన పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఏపుగా పెరిగిన తమ పొలాన్ని చూసి మురిసిపోయారు. ఇటీవల వచ్చిన వరదలతో పంట దెబ్బ తింటే.. గుండెలు బాదుకున్నారు. చేతికొచ్చిన పంట.. నోటికి అందకుండా పోయిందే అని కుమిలిపోయారు. మిగిలిన పంటతో కనీసం మన పెట్టుబడి మనకు వచ్చినా చాలులే అని సర్ది చెప్పుకున్నారు. అకాల వర్షాలకు పోనూ.. మిగిలిన పంటను కోసి, నూర్పిడి చేసి అమ్మకానికి పెట్టారు. డబ్బుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఆ డబ్బులు పడితే మరో పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవాలని.. ఈసారి పంట బాగా తీసి అప్పులు తీర్చుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.
Young Man Suicide at Appalraopet in Warangal : వారు అనుకున్నట్లుగానే ఇటీవల ధాన్యం డబ్బులు ఖాతాలో జమయ్యాయి. వర్షాలు మొదలయ్యాయి.. విత్తనాలు తేవాలి, దుక్కి దున్నించాలి అని ఏవేవో ఊహించుకున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అందుకు సంబంధించిన పనులు మొదలు పెడదామని అనుకున్నారు. ఇంతలోనే వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆరు నెలలు కష్టపడి పండిస్తే వచ్చిన పంట డబ్బులను.. వారి ముద్దుల కుమారుడు అరగంటలో ఆవిరి చేసేశాడు. ఖాతాలో నుంచి డబ్బులు తీసుకుంటే వృథా ఖర్చులు అవుతాయనే భయంతో వారు అందులోనే ఉంచితే.. ఇవేవీ తెలియని, పట్టని తనయుడు ఖాతాను ఖాళీ చేసేశాడు.
ఆన్‌లైన్ గేమ్ ఆడి ఉన్న డబ్బులను పోగొట్టేశాడు. అనంతరం తల్లిదండ్రులకు విషయం తెలిస్తే మందలిస్తారని ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి కడుపుకోతను మిగిల్చాడు. ఇటు పంట డబ్బులు పోయి.. అటు చేతికి వచ్చిన కుమారుడు అనంతలోకాలకు చేరడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన భాషబోయిన కమలాకర్, స్వప్న దంపతులు. వీరి రెండో కుమారుడు భాషబోయిన ఉదయ్ శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌లో గేమ్ ఆడి దాదాపు రూ.40 వేలు పోగొట్టుకున్నాడు.