World Heritage Day Celebrations In Ramappa: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా.. రామప్పలో జరిగిన కళాకారుల ప్రదర్శనలు.. ఆద్యంతం కనువిందు చేశాయి. శిల్పం వర్ణం కృష్ణం పేరుతో నిర్వహించిన ఈ వేడుకలు వావ్ అనిపించేలా అబ్బురపపరిచాయి. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ వేడుకలను ప్రారంభించారు. ఎమ్మెల్యే సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శిల్ప కళాకృతులకు నిలయమైన రామప్ప ఖ్యాతి.. యునెస్కో గుర్తింపుతో విశ్వవ్యాప్తమైందని మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్దతోనే ఈ గుర్తింపు లభించిందని.. రామప్పను రాష్ట్ర నిధులతో.. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
రాజ్ కుమార్ బృందం కళాకారుల సంప్రదాయ పేరిణి నాట్యం.. ప్రేక్షకులను కన్నార్పకుండా చేశాయి. 200 మందికి పైగా కళాకారులతో శ్రావ్య మానస నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఇంకా ఇతర కళాకారుల నాట్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. రామప్ప ఖ్యాతిని తెలియచేసే లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. బలగం చిత్ర దర్శకుడు వేణుతోపాటుగా.. ఇతర నటీనటులకు.. మంత్రులు మెమెంటోలిచ్చి ఘనంగా సత్కరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, డ్రమ్స్ వాద్యకారుడు శివమణి, గాయకుడు కార్తీక్ తదితరులు తమ ప్రదర్శనలతో.. ప్రేక్షకులను సమ్మోహనపరిచారు.
"రామప్ప ఒక దేవాలయం మాత్రమే కాదు. అందులో అద్భుతమైన మన ప్రాంత చరిత్ర, నైపుణ్యం, కళ, శక్తి ఉంది. 800 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతానికి అద్భుతమైన శిల్ప సౌందర్యాన్ని అందించారు. ప్రపంచంలో ఎవరూ ఇలాంటి కట్టడాలను కట్టే ఆలోచన చేయని విధంగా నిర్మాణాలు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని వచ్చినా సరే తట్టుకోగలదు. నీటిపై తేలియాడే ఇటుకలు, శాండ్ టెక్నాలజీతో కట్టిన రామప్ప దేవాలయం అద్భుతం. రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తుంది." - శ్రీనివాస్ గౌడ్, మంత్రి