దేశ రాజధాని దిల్లీలో వరంగల్ అర్బన్ జిల్లాకు ‘స్వచ్ఛ సుందర్ శౌచాలయ్’ పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా 685 జిల్లాలోని 6786 గ్రామాలు పోటీ పడగా, పది జిల్లాలకు మాత్రమే బహుమతి దక్కింది. అందులో రాష్ట్రం నుంచి పెద్దపల్లి జిల్లాతోపాటు, వరంగల్ అర్బన్ మాత్రమే ఉన్నాయి. పెద్దపల్లి మూడో స్థానంలో నిలవగా, వరంగల్ అర్బన్ 5వ స్థానంలో నిలిచింది.
మరుగుదొడ్లను కట్టడం ప్రభుత్వం వంతు
ఊరూరా వంద శాతం మరుగుదొడ్లను కట్టడం ప్రభుత్వం వంతు. వాటిని ప్రజలు నిత్యం వాడాలి. పరిశుభ్రంగా నిర్వహించాలి. అప్పుడే స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరుతుంది. ఇందుకు వరంగల్ అర్బన్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంతో కృషి చేస్తోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు స్వచ్ఛ సుందర్ శౌచాలయ్ పోటీ జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మార్గదర్శనంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాము అనేక గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ సిబ్బంది, సెర్ప్, ఐకేపీ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మరుగుదొడ్ల వినియోగంపై గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
2017లోనే ఓడీఎఫ్’ జిల్లా
2017లోనే వరంగల్ అర్బన్ జిల్లా వందశాతం మరుగుదొడ్లతో ‘ఓడీఎఫ్’ గా ప్రకటించారు. జిల్లా మొత్తం మీద 42,230 మరుగుదొడ్లు నిర్మించారు. పైగా కేవలం నెలరోజుల్లోనే 11 వేలు నిర్మించడం అప్పట్లో రికార్ఢు జిల్లాలో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించినందుకు అప్పట్లో స్వచ్ఛ దర్పణ్ పురస్కారం కూడా దిల్లీలో అందుకున్నారు.