Warangal Farmers Problems : అతివృష్టి, అనావృష్టి ఏదొచ్చినా రైతుకు తిప్పలు తప్పట్లేదు. పూర్తిగా వర్షాధారంపైనే సాగును నమ్ముకున్న అన్నదాతలకు అత్యధిక వర్షపాతం శరాఘాతంగా మారింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వరదలకు చెరవులు, కుంటలు తెగిపోయాయి. దీంతో చెరువు వెనక ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సాగు చేయడానికి నీళ్లు లేక, ఏం చేయాలో పాలు పోక దయనీయ పరిస్థితిలో రైతులు ఎదురుచూస్తున్నారు.
Warangal Farmers Problems for Irrigation Water : వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆలస్యంగానైనా సమృద్ధిగా కురిసిన వర్షాలతో రైతులునాట్లకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పత్తి, మొక్కజొన్న వంటి పంటలు వరదలకు కొట్టుకపోగా తాజాగా పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల చెరువు కట్టలు తెగి నీరు లేకుండా పోయింది. దీంతో నారుమడులు పోసుకొని సిద్ధమైన రైతులకు ఏం చేయాలో పాలు పోవట్లేదు. చెరువులు నిండితేనే...వ్యవసాయ బావుల్లో నీళ్లూరుతాయని కర్షకులు వెల్లడిస్తున్నారు. చెరువు, కుంటలను నమ్మి సాగు సిద్ధమైన అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
''చెరువుకు గండి పడడంతో 500మంది రైతులం నష్టపోతున్నాం. మేము వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. వ్యవసాయం లేక తిండికి ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు వెంటనే స్పందించి తెగిపోయిన చెరువుకు మరమ్మతులు చేస్తే వచ్చే యాసంగి పంటలు అయినా పండించుకోవచ్చు." - రైతులు
''చెరువులో చేపలు లేక వలలు పట్టుకొని తిరిగి వెళ్లిపోతున్నాం. చెరువులో నీళ్లు లేకపోవడంతో చేపలు పెంచే పరిస్థితి లేదు. దీనివల్ల మత్స్యకారులం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి మరమ్మతు పనులుచేపట్టాలని కోరుతున్నాం.'' - మత్స్యకారులు