Cp Ranganath on Preethi Suicide incident Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రీతిని హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశామని.. హత్య చేసినట్లు ఎక్కడ ఆధారాలు లభించలేదని సీపీ వివరించారు.
మెడికో ప్రీతి మృతి కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కోసం వేచిచూస్తున్నట్లు వ్యాఖ్యానించిన సీపీ రంగనాథ్... మంత్రి కేటీఆర్, హరీశ్‌రావులకు కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని తెలిపారు. నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించిందన్నారు. ప్రధాన నిందితుడు అయిన సీనియర్ విద్యార్థి సైఫ్‌తో పాటు మరో ఇద్దరిపై అనుమానం ఉందని.. వారిని అదుపులోకి తీసుకునేందుకు ఆధారాలను సేకరిస్తున్నామని సీపీ తెలిపారు. ఏ విధంగా చూసిన ప్రీతి మృతికి కారణం ర్యాగింగే అని స్పష్టం చేశారు. వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకునే రోజు వరకు సైఫ్ ఆమెను వేధించిన్నట్లు పేర్కొన్నారు.
'మెడికో ప్రీతి మృతి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రీతి హత్యకు గురైనట్లు ఏలాంటి ఆధారాలు లేవు. ప్రీతి పోస్టుమార్టం రిపోర్ట్ కోసం చూస్తున్నాం. ఏ విధంగా చూసిన ప్రీతి మృతికి కారణం ర్యాగింగే. ప్రీతి కేసు దర్యాప్తును ప్రభుత్వం పరిశీలిస్తోంది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దర్యాప్తును పరిశీలిస్తున్నారు.'-రంగనాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్