తెరాస కుటుంబ, అవినీతి పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, దుబ్బాకలోనే కాకుండా తెలంగాణ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. కేంద్రమంత్రి అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి రావాలనుకున్నా.. కరోనా, ఇతర కారణాలతో వీలుకాలేదన్నారు. అంతకుముందు వరంగల్‌కు వెళ్తుండగా జనగామలో ఆగిన కిషన్‌రెడ్డి... అక్కడ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు.
రాష్ట్రం నిధులు ఇవ్వకపోవడం వల్లనే..
భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం... కాకతీయ వైద్య కళాశాలను సందర్శించిన కిషన్‌రెడ్డి... 120 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా కేంద్రం 2014లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టిందన్న ఆయన.. కేఎంసీకి రూ.120 కోట్లు కేటాయించినా రాష్ట్రం నిధులు ఇవ్వనందునే ప్రారంభోత్సవంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే ఆస్పత్రి ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.