HighCourt on Green Field National Highway: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ ఆపాలంటూ హనుమకొండ జిల్లా బాధిత రైతులు వేసిన పిటిషన్ హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. ఆ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం రైతులను భూముల నుంచి ఖాళీ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల-వరంగల్ హైవే పనుల నోటిఫికేషన్ నిలిపివేయాలని రైతులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దాంతో 8 వారాల వరకు భూముల నుంచి ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పర్యావరణ అనుమతి తీసుకోవాలని సూచించింది. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు పంపింది.
హనుమకొండ జిల్లాలో ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కారణంగా భూములు కోల్పోతున్న బాధిత రైతులు త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్ నిలిపివేయాలంటూ ఫిబ్రవరి 22వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్ను ప్రస్తుతానికి 8 వారాల పాటు నిలిపేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించింది. రైతులకు సానుకూలంగా తీర్పు రావడంతో బాధిత రైతులు హనుమకొండ జిల్లా పరకాల ఆర్డీఓ కార్యాలయంలో కోర్టు తీర్పు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతులు పచ్చటి పంట పొలాలను ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. భూముల కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.