Telangana Congress Hope On Rahul: తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో విజయంపై కాంగ్రెస్ మరోసారి ఆశలు పెట్టుకుంది. తమపై విశ్వాసం చూపాలంటూ... పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ఓటర్లను అభ్యర్థించనున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే ఉండటంతో... పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించటంతో పాటు ఆయా వర్గాలకు భరోసా కల్పించే విధంగా హామీలు ఇవ్వనున్నారు. నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపే లక్ష్యంతో రాహుల్ పర్యటన సాగనుంది. పార్టీకి దూరమైన వారిని తిరిగి అక్కున చేర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పిన తర్వాత... క్యాడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చినా.... నేతల చేష్టల కారణంగా తలకిందులైంది. కొంతమంది సీనియర్ నేతలపై వేల సంఖ్యలో అదిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పార్టీలో సంస్కరణలు అనివార్యమని భావించిన నాయకత్వం సీనియర్లను దిల్లీకి పిలిచి మరీ చీవాట్లు పెట్టి పంపించారు. ఇప్పుడు నేరుగా రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తుండటంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధినాయకత్వం కొంత మేర కసరత్తు చేసింది. పార్టీలో ప్రక్షాళన ఏ మేరకు అవసరమన్న అంశాలపై సమాలోచనలు చేశారు. కొన్ని విషయాలను సీనియర్ నాయకుల ఎదుటే రాహుల్ గాంధీ కుండబద్దలు కొట్టారు. దీంతో వారి నోటికి తాళం పడగా... మిగిలిన వారు జాగ్రత్త వహిస్తున్నారు. ఇక గాంధీభవన్‌లో జరిగే సమావేశంలోనూ రాహుల్ మరోసారి నేతలకు అక్షింతలు వేసే అవకాశం ఉంది.