తెలంగాణ

telangana

ETV Bharat / state

Kaveri seeds chief: సాగు చేస్తానంటే నాన్న సంతోషపడ్డారు.! - special story on kaveri seeds owner

ఉన్నత చదువులు చదివినప్పటికీ వ్యవసాయంపై మక్కువ పోలేదు. ఆ ఇష్టంతోనే మెడిసిన్​లో సీటు వచ్చినా వదులుకొని వ్యవసాయం రంగంలో అడుగుపెట్టారు. రైతులు పచ్చని పంటలు పండించి వారు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో మేలు రకం విత్తనాల ఉత్పత్తిని ప్రారంభించారు. ఆ వ్యాపారంలో తాను లాభం గడించడమే గాక లక్షలాది మంది రైతన్నల మెప్పు పొందారు. అంతే కాకుండా సొంతూరు అభివృద్ధికి తన వంతు సాయం చేశారు. ఆయనే కావేరి సీడ్స్​ యజమాని గుండవరం వెంకట భాస్కర్​.

kaveri seeds owner story
కావేరి సీడ్స్​ అధినేత

By

Published : Jun 13, 2021, 9:30 AM IST

తోబుట్టువులందరూ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చేసి దేశవిదేశాల్లో స్థిరపడాలనుకుంటే, ఆయన మనసు మాత్రం సొంతూరు చుట్టే తిరిగేది. విదేశాల్లో స్థిరపడటంకన్నా సొంతూళ్లోనే ఉంటూ వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించి తోటి రైతులకు ఆదర్శంగా నిలవాలనుకున్నారు. అందుకే మెడిసిన్‌లో సీటు వచ్చినా వదిలేసి అగ్రికల్చర్‌ బిఎస్సీ చేశారు. ఆపైన పొలంబాట పట్టడమే కాదు, తానే మేలి రకం విత్తనోత్పత్తికి నడుం బిగించారు. ఆయనే కావేరీ సీడ్స్‌ అధినేత గుండవరం వెంకట భాస్కర్‌రావు.ఆ కంపెనీ విత్తనాలు నేడు కోట్ల ఎకరాల్లో పచ్చని పైరుగా మారుతున్నాయి. రైతులకు సిరుల్ని కురిపిస్తున్నాయి. ఆ ప్రస్థానాన్ని మనతో పంచుకుంటున్నారిలా...
మాది వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపురం. ఒకప్పుడు ఇది కరీంనగర్‌ జిల్లా. అమ్మానాన్నలు సత్యవతి, శ్రీనివాసరావు. మేం పదిమంది సంతానం. నేను అయిదోవాణ్ని. మా పెద్దన్నయ్య ఇంజినీరింగ్‌ చేసి అమెరికాలో స్థిరపడ్డాడు. రెండో అన్నయ్య, అక్కలిద్దరూ డాక్టర్లే. నా తర్వాత వాళ్లలో కూడా ఒకరు తప్పితే మిగితావాళ్లు డాక్టర్లూ, ఇంజినీర్లే. ఆస్తులకంటే చదువువల్లే జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారని భావించేవారు అమ్మానాన్న. మా చదువుల కోసం 1960ల్లోనే హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అబిడ్స్‌లోని లిటిల్‌ ఫ్లవర్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో మమ్మల్ని చదివించారు. బంగారాన్ని కూడా అమ్మి మా చదువులకు పెట్టారు. అప్పట్లో మేమంతా క్లాస్‌లో ఫస్ట్‌, సెకండ్‌ వచ్చేవాళ్లం. ఆ బలమైన పునాదివల్లనే అందరం ఉన్నత చదువులు చదువుకున్నాం.

పొలంలోనే ప్రయోగాలు...
నాకు మా ఊరన్నా, వ్యవసాయమన్నా మాటల్లో చెప్పలేనంత ఇష్టం. నేను చదువుకునే రోజుల్లోనే తెలంగాణ ఉద్యమం కారణంగా ఓ ఏడాదంతా స్కూళ్లు తెరవలేదు. ఆ సమయంలో పొలంలోనే ఉన్నాను. ఆ తర్వాత కూడా నాన్నతో వీలున్నప్పుడల్లా పొలానికి వెళ్లి ఆసక్తిగా పంటలను గమనించేవాణ్ని. సాగుమీద ఇష్టం ఏ స్థాయికి చేరిందంటే ఎంబీబీఎస్‌లో సీటొచ్చినా రెండో ఆలోచన లేకుండా వదులుకున్నా. 1974లో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌లో చేరా. ఈ విషయంలో అమ్మానాన్న కూడా నన్ను వ్యతిరేకించలేదు. మాకు పొలాలు ఉండేవి. వాటిని చూడ్డానికి ఒకరుండాలి కదా అనుకున్నారు. డిగ్రీ పూర్తవగానే ఫ్రెండ్స్‌తోపాటు బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్‌, అటవీ శాఖలో రేంజర్‌ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలు రాశా. ఆ ఫలితాలు రాకుండానే మా ఊళ్లో వాలిపోయా. నా గురించి తెలిసి... ‘అయినా ఈ రోజుల్లో ఎవుసం చేసి బాగుపడేదెవరు’ అంటూ అనేక మంది నిరుత్సాహపరిచేవారు. అలా అనడానికీ కారణం ఉంది. అప్పట్లో మా ప్రాంతంలో మొక్కజొన్న సాగుచేసేవారు. సరైన దిగుబడి వచ్చేది కాదు. ఆ సమయంలోనే నేను రాసిన ఉద్యోగాల ఫలితాలు విడుదలయ్యాయి. నాకు రెండు ఉద్యోగాలూ వచ్చాయి. కానీ చేరలేదు. ‘విదేశాల్లో మేలి రకం పంటలు పండుతాయి, మన దగ్గర ఎందుకీ పరిస్థితి’ అని బాగా ఆలోచించా. నాణ్యమైన విత్తనాలు ఉంటేనే దిగుబడి పెరుగుతుందని అర్థమైంది. నా బిఎస్సీ నేపథ్యం ఉపయోగించి కొన్ని ప్రయోగాలు చేస్తూ మూడెకరాల్లో మొదట మొక్కజొన్న విత్తనోత్పత్తి మొదలుపెట్టా. ఆ విత్తనాలు ఇరుగుపొరుగు రైతులకు కూడా ఇచ్చేవాడిని. వాటితో దిగుబడి సాధారణంకంటే రెండు మూడు రెట్లు పెరిగింది. దాంతో నామీద రైతులకూ నమ్మకం కలిగింది. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్లనుంచీ రైతులు విత్తనాల కోసం వచ్చేవారు. డిమాండ్‌ని అందుకోవడానికి మా పొలంలో కేవలం విత్తనాలనే సాగుచేయడం మొదలుపెట్టా.
అందుకే ‘కావేరి’...
నా మిత్రుల ద్వారా ఉత్తర కర్ణాటకలోని దావణగిరె ప్రాంతంలో రైతులు బాగా వ్యవసాయం చేస్తారని తెలిసి ఇక్కణ్నుంచి విత్తనాలు పట్టుకుని వెళ్లాను. మొదట్లో నేనే విత్తనాల ప్యాకెట్లను మారుమూల పల్లెలకు మోటార్‌సైకిల్‌మీద తీసుకువెళ్లి రైతులకు అమ్మేవాణ్ని. ‘పంట వేయండి, దిగుబడి బాగా వస్తేనే డబ్బులు ఇవ్వండి’ అని చెప్పేవాణ్ని. మళ్లీ నాలుగైదు నెలల తర్వాత వెళ్తే రైతులంతా సంతోషంగా డబ్బులిచ్చేవారు. 1980లో నా పేరిటే ‘జీవీబీ రావు అండ్‌ కంపెనీ’ని కేవలం ఇద్దరు ఉద్యోగులతో మొదలుపెట్టా. 1982లో మావూరులోనే మొదటి విత్తనోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించా. ఆ క్రమంలో విత్తనాల సాగుని పదెకరాల నుంచి వెయ్యెకరాల స్థాయికి తీసుకెళ్లాం. అప్పుడే హైదరాబాద్‌లో కంపెనీ ఆఫీసునీ తెరిచా. 1986 నాటికి కర్ణాటకలోని మొక్కజొన్న రైతులందరూ మా విత్తనాల్ని వాడేలా పరిస్థితి మారింది. ఆ సమయంలో మాకంటూ ఒక బ్రాండ్‌ ఉండాలనుకున్నా. అప్పటికి మా విత్తనాల్ని ఎక్కువగా సాగుచేసేది కర్ణాటక రైతులే. అందుకే అక్కడి రైతుల జీవితాలతో ముడిపడి ఉన్న జీవనది కావేరి పేరు పెట్టాలనుకున్నా. ఆ నదిలానే మా విత్తనాలు కూడా అన్నదాతలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టి, వారి జీవితాల్లో ఆనందాల్ని నింపాలన్నది నా లక్ష్యం. అలా 1986లో ‘కావేరీ సీడ్స్‌’ ఏర్పడింది. అదే సమయంలో అమెరికాకు చెందిన పయొనీర్‌ సంస్థ కూడా ఓ హైబ్రిడ్‌ రకాన్ని కొన్నేళ్లు మాద్వారా మార్కెట్‌ చేయించేది.
ఏడు విత్తనాభివృద్ధి కేంద్రాలు...
తెలంగాణ ప్రాంతం విత్తన అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ గాలిలో తేమ ఉండదు. కాబట్టి నిల్వ చేయడం సులభం. శాస్త్రీయ పద్ధతిలో మరిన్ని పరిశోధనలు జరగాలని హైదరాబాద్‌ సమీపంలోని కండ్లకోయలో విత్తనాభివృద్ధి-పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించాం. తర్వాత గౌరారం, ఏలూరు లాంటిచోట్లా ఇలాంటి వాటిని ఏర్పాటుచేశాం. క్రమంగా మొక్కజొన్నతోపాటు పత్తి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, సోయా తదితర పది రకాల పంటలకు సంబంధించిన విత్తనాలమీద పరిశోధనలు చేసి ఉత్పత్తినీ మొదలుపెట్టాం. మాకు ప్రస్తుతం ఉన్న ఏడు విత్తనాభివృద్ధి కేంద్రాల్లో 2008లో ప్రారంభించిన పాములపర్తి విత్తనోత్పత్తి, పరిశోధన కేంద్రం అతి పెద్దది. 150 ఎకరాల్లో విస్తరించిన ఈ కేంద్రంలో 150 మందికిపైగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు. విత్తనోత్పత్తి చాలా రిస్కుతో కూడిన వ్యాపారం. ఎందుకంటే ఒక హైబ్రిడ్‌ వంగడాన్ని సృష్టించాలంటే ఆరేడేళ్లు పడుతుంది. ఆ క్రమంలో వెయ్యికిపైగా సంకరీకరణాలు చేస్తాం. ఆ తర్వాత కూడా మార్కెట్‌లోని పోటీదారుకంటే మన వంగడం మెరుగైనదిగా నిరూపితమవ్వాలి. దిగుబడి, చీడపీడల్ని తట్టుకోగలగడం, పంట వ్యవధి... ఇలాంటి అంశాలన్నింటినీ రైతులు మిగతా బ్రాండ్లతో పోల్చి చూస్తారు. సంతృప్తి చెందితేనే కొత్త వాటిని వాడతారు. మనం ఎంత చెప్పినా కూడా సాటి రైతు అభిప్రాయమే వాళ్లకి ముఖ్యం. అందుకే పరిశోధనలకు చాలా ఖర్చు అవుతుంది.

మరిన్ని పరిశోధనల దిశగా

పరిశోధనలమీద మరింత దృష్టి పెట్టాలనే లక్ష్యంతో 2007లో పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లి రూ.68కోట్లు సమీకరించాం. ఆ టైమ్‌లో మేం తెచ్చిన కొన్ని వంగడాలు కంపెనీకి మంచి లాభాలు తెచ్చాయి. ఓ రకం పత్తి విత్తనాలైతే మొదటి ఏడాది కేవలం 25వేల ప్యాకెట్లు అమ్ముడైతే, రెండో ఏడాది అమ్మకాలు అంతకు పది రెట్లు పెరిగాయి. ఇప్పటికీ అవి మాకు మార్కెట్‌లో లాభాలు తెస్తున్నాయి. ప్రస్తుతం మొక్కజొన్న, పత్తి, వరి వంగడాలు మాకు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెస్తున్నాయి. పత్తి, పొద్దుతిరుగుడు లాంటి పంటలు సంతృప్త స్థాయికి చేరాయి. అందుకే మేం కొత్త రకాల పంటలవైపు అడుగుపెట్టాం. వరిలో పరిశోధనల్ని మరింత పెంచుతాం. దాంతోపాటు కూరగాయలూ, పిచికారీ మందులవైపు దృష్టిపెట్టాం. ఆరేళ్ల నుంచీ టొమాటో, మిరప, బెండ, బీర, సొర, కాకరలాంటి పంటల్లో కొత్త వంగడాలు తేవడంపైన పరిశోధనలు చేస్తున్నాం. ఇప్పటికే కూరగాయల విభాగం మాకు ఏటా రూ.50 కోట్ల ఆదాయాన్ని తెస్తోంది. వచ్చే రెండు మూడేళ్లలో అది రెండు మూడు రెట్లు పెరగనుంది. గ్రీన్‌హౌస్‌ల్లో కొన్ని విదేశీ కూరగాయల్ని పెంచి ఎగుమతి చేస్తున్నాం. మా కంపెనీకి చెందిన పత్తి విత్తనాల బ్రాండ్లు జాదూ, జాక్‌పాట్‌, ఏటీమ్‌; సజ్జలో సూపర్‌ బాస్‌; వరిలో సంపూర్ణ, కేపీహెచ్‌ 468 మాకు మంచి పేరు తెచ్చాయి.

వాతావరణ పరిస్థితులను బట్టి

భారత్‌లో వ్యవసాయం రుతుపవనాలతో జూదమని చెబుతారు. మా వ్యాపారం కూడా అంతే. ఖరీఫ్‌లో వానలుపడే సమయాన్నిబట్టి రైతులు పంటలను మారుస్తుంటారు. జూన్‌లో వర్షాలు పడితే ఒక రకం, వర్షాలు ఆలస్యమైతే మరో రకం వేస్తారు. ఈ క్రమంలో డిమాండుకు అనుగుణంగా విత్తనాల్ని అందుబాటులో ఉంచడం కత్తిమీద సామే. పైగా మా బ్రాండు పేరుతో సొమ్ము చేసుకునేందుకు అనేక నకిలీ కంపెనీలు మార్కెట్లోకి వస్తుంటాయి. వాటిని కట్టడి చేయడమూ సవాలే. సాగులానే ఈ రంగంలోనూ ఓర్పు, సహనం, నిరంతర శ్రమా ఉండాలి. రాత్రికి రాత్రే లాభాలనేవి ఇక్కడ సాధ్యం కాదు. ఈస్థాయికి రావడానికి మాకు 40 ఏళ్లు పట్టింది. ఇప్పటికీ ఇక్కడ భారీ ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోలేదు. దీన్నో వ్యాపారంలా చూడలేదు. ఇన్వెస్టర్లూ, ఉద్యోగులూ, రైతుల మేలుకోసమైనా ఏటా 10-15 శాతం వృద్ధి చాలనుకుంటా. అంతకు మించి ఆశించిన కంపెనీలెన్నో దుకాణాలు కట్టేశాయి. రూ.వెయ్యికోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌తో ‘కావేరి సీడ్స్‌’ దేశంలోని అతిపెద్ద విత్తనోత్పత్తి కంపెనీల్లో ఒకటని సగర్వంగా చెప్పగలను. విదేశాలకూ విత్తనాల్ని ఎగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం లక్ష ఎకరాల్లో మేం ఉత్పత్తి చేస్తున్న విత్తనాలను రైతులు కోట్ల ఎకరాల్లో నాటి సాగు చేసి లాభాలు గడించడం నాకెంతో తృప్తిగా ఉంటుంది. సాటి రైతు బాగుపడటానికి మించిన సంతృప్తి ఈ రైతుకి ఏముంటుంది!

ఊరుమీద ప్రేమతో...

న్ను ఇంతవాణ్ని చేసింది మావూరే. అందుకే ఓ ట్రస్టు పెట్టి అమ్మానాన్న జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపడుతున్నా. ఊళ్లో రైతు వేదికను సొంత ఖర్చుతో నిర్మించా. అందులో రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు ప్రొజెక్టర్‌, తెరలను ఏర్పాటుచేశాం. మా పక్క ఊరు కోతులనడుమలోనూ ఇలాంటి వేదిక నిర్మించి ఇవ్వాలని ఆ గ్రామం వారుకోరితే సరేనన్నాను. ఊళ్లో చెరువును బాగుచేయించాం. జెడ్పీ హైస్కూల్‌ని మూడంతస్తుల భవనంలో కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దాం. ఇందులో ఉపాధ్యాయులు సరిపడా లేకపోతే సొంతంగా 15 మందిని నియమించాం. ఈ బడికి పిల్లలను తీసుకొచ్చేందుకు బస్సుని సైతం పెట్టించాం. ఊళ్లో గుడి, కల్యాణ మండపం కట్టించాం. బడి, గుడి తదితర అవసరాలకు కార్పస్‌ నిధి ఏర్పాటు చేస్తున్నాం.

పిల్లలిద్దరూ డాక్టర్లే...

* నా శ్రీమతి వనజ. మాకో అమ్మాయి మధుశ్రీ, అబ్బాయి పవన్‌. ఇద్దరూ డాక్టర్లే. వాళ్లకి పెళ్లిళ్లు అయ్యాయి. అబ్బాయి సూపర్‌ స్పెషాలిటీ చేస్తున్నాడు.
కంపెనీ పగ్గాలు చేపట్టమని మా అబ్బాయిని బలవంతం చేయడంలేదు. వాడి ఇష్టమేనని చెప్పా.
* మా బంధువుల అబ్బాయిలు మిథున్‌చంద్‌, వంశీధర్‌ డైరెక్టర్లుగా, షేర్‌ హోల్డర్లుగా ఉన్నారు. కంపెనీ నిర్వహణలో నాకు సాయంగా ఉంటున్నారు.
* మాది ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబం. చినజీయర్‌ స్వామి శిష్యులం.
* కావేరీ సీడ్స్‌ని ఆసియాలోని టాప్‌-200 మధ్యతరహా (మార్కెట్‌ విలువ బిలియన్‌ డాలర్‌ లోపు) కంపెనీల్లో ఒకటిగా ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ గతేడాది గుర్తించింది. కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు రూ.3500కోట్లు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అయిదువేల మంది ఉపాధి పొందుతున్నారు.

కావేరీ సీడ్స్​

ఇదీ చదవండి:TSIIC: ప్రత్యేక ఆహారశుద్ధి మండలాలపై కార్యాచరణ

ABOUT THE AUTHOR

...view details