తెలంగాణ

telangana

ETV Bharat / state

తొమ్మిది నెలల చిన్నారిపై మృగాడి పైశాచికం - murder

ముక్కుపచ్చలారని పసికందును ఓ మానవమృగం చిదిమేసింది. అమ్మ పొత్తిళ్లలో ఆదమరచి నిద్రపోతున్న తొమ్మిదినెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి మానవలోకం తలదించుకునేలా చేశాడో మృగాడు. హన్మకొండలో జరిగిన ఈ ఘటన సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

చిన్నారిపై మానవ మృగం ఘాతుకం

By

Published : Jun 19, 2019, 11:46 PM IST

Updated : Jun 20, 2019, 9:22 AM IST

పాలుతాగే పసికందు మానవత్వం మరచిన ఓ రాక్షసుడి చేతిలో బలైపోయింది. పెళ్లైన మూడేళ్ల తర్వాత లేక లేక కలిగిన ఏకైక సంతానాన్ని మృగాడు చిదిమేశాడు. హన్మకొండలో జరిగిన ఘటన ఓ తల్లికి గర్భశోకం మిగిల్చింది.

చిన్నారిపై మానవ మృగం ఘాతుకం

హైదరాబాద్​లో ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న ఓ దంపతులకు పెళ్లైన మూడేళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. వేసవి సెలవులు కావడం వల్ల చిన్నారిని తీసుకుని ఆ తల్లి హన్మకొండలోని పుట్టింటికి వచ్చింది. ఇంట్లో ఉక్కపోతగా ఉండటం వల్ల కుటుంబసభ్యులంతా డాబాపై పడుకున్నారు. పాలు తాగి అమ్మ ఒడిలో ఆదమరిచి నిద్రిస్తున్న ఆ చిన్నారి పక్క కాలనీలో ఉండే ప్రవీణ్​ అనే దుర్మార్గుడు ఎత్తికెళ్లి అత్యాచారం చేసి కడతేర్చాడు. కొంత సేపటికి మేల్కొన్న తల్లి పాప కనిపించక పోయేసరికి పరిసరాలన్నీ గాలించారు.

ఈ క్రమంలో నిందితుడు పాపను వస్త్రంలో చుట్టి తీసుకెళ్తుండగా చూసిన కుటుంబ సభ్యులు అతడిని పట్టుకున్నారు. పిల్లను కింద పడేసి పరుగందుకున్నాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పాపపై అత్యాచారం జరిగి మృతి చెందినట్లు నిర్ధారించారు. విగత జీవిగా మారిన చిట్టితల్లిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.

వెల్లువెత్తిన నిరసనలు

అభం శుభం తెలియని పసిపాప మానవ మృగానికి బలికావడం స్థానికులు, బంధువుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హన్మకొండలోని అశోక కూడలిలో మానవహారం చేశారు. నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్​ చేశారు.

కఠినంగా శిక్షిస్తాం

నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేసినట్లు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రవీందర్‌ తెలిపారు. నిందితుడిపై అత్యాచారం, హత్య కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. హన్మకొండ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు విచారం వ్యక్తంచేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

సభ్యసమాజం తలదించుకునే విధంగా నిందితుడు చేసిన ఈ చర్యను అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'కామాంధుడిని నడిరోడ్డుపై ఎన్​కౌంటర్​ చేయాలి'

Last Updated : Jun 20, 2019, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details