Pollution At Pakhal Lake: చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం. ఎన్నో రకాల పక్షి జాతులు, ప్రకృతి సోయగాలకు నెలవైన ప్రదేశం. పర్యాటకులకు స్వర్గధామం.. పాకాల సరస్సు. స్వచ్ఛతకు చిరునామాగా పేరొంది.. ఆసియాలోనే ఏడో స్వచ్ఛమైన సరస్సుగా నిలిచింది. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఈ సరస్సుకు ప్లాస్టిక్ మహమ్మారి పెనుశాపంగా మారింది. సందర్శకులు, సమీప ప్రాంతాల ప్రజలు విచ్ఛలవిడిగా ప్లాస్టిక్ వాడకంతో పాకాల సరస్సు క్రమంగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.
విచ్చల విడిగా ప్లాస్టిక్ వినియోగం..
కాకతీయుల పాలనకు సజీవ సాక్ష్యం. అన్నదాతలకు అండగా... ప్రకృతి ప్రేమికుల కనువిందు చేసే మంచినీటి సరస్సు పాకాల క్రమంగా కలుషితమవుతోంది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఈ సరస్సు ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తోంది. వందలాది మొసళ్లకు ఆవాసంగా ఉన్న పాకాల.. ప్లాస్టిక్ వినియోగం శాపంగా మారుతోంది. చెరువు పరిసర గ్రామాల ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు విచ్ఛలవిడిగా ప్లాస్టిక్ వాడుతున్నారు. కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర ఆహార పొట్లాలను ఇష్టానుసారంగా సరస్సు పరిసరాల్లో వేస్తుండటంతో అవన్నీ సరస్సులోకి కొట్టుకువస్తున్నాయి.