Officials interrogated Etala Rajender: ముఖ్యమంత్రి కుట్ర ఫలితంగానే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని హుజూరాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్‌లో వైరల్ అయిన కేసులో విచారణ కోసం ఈరోజు ఆయన హనుమకొండ డీసీపీ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు చెబుతున్నట్లుగా ప్రశాంత్ నుంచి తనకు ఎలాంటి ఫోన్‌కాల్ రాలేదని స్పష్టం చేశారు. కమిషనరేట్లోకి ఈటల వెంట నేతలెవరినూ పోలీసులు అనుమతించలేదు. కేవలం బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధి రామకృష్ణతో కలసి ఆయన విచారణకు హాజరైయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు సెంట్రల్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ, ఏసీపీ, కమలాపూర్ సీఐ నేతృత్వంలో విచారణ జరిగింది. విచారణ ముగిసిన కమిషనరేట్ కార్యాలయం బయట ఈటల మీడియాతో మాట్లాడారు.
విచారణ ఎలా సాగింది: పదో తరగతి హిందీ పేపర్ లీకేజ్ విషయంలో ఈరోజు ఈటల రాజేందర్‌ను అధికారులు విచారించారు. లీకేజ్ విషయంలో తనకు జర్నలిస్ట్ ప్రశాంత్ నుంచి వాట్సప్ కాల్ వచ్చిందని అధికారులు ఆరోపించారని ఈటల అన్నారు. విచారణకు తన మొబైల్‌తో సహా విచారణకు హాజరైనట్లు తెలిపారు. తన ఫోన్‌ని అధికారులు తమ సమక్షంలో పరిశీలించినట్లు వెల్లడించారు. ప్రశాంత్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని నిర్ధరించుకున్నారని చెప్పారు. తన సెల్‌ఫోన్‌కు మహేశ్ వాట్సప్ మెసేజ్ పంపాడని.. ఇతరులకు ఎవ్వరికి తాను మెసేజ్ పంపలేదని అధికారులు నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
కేసీఆర్‌పై విమర్శలు: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటల విమర్శలు చేశారు. పేపర్ లీక్ మాట పచ్చి అబద్ధం.. జరిగింది మాల్ ప్రాక్టీస్ అని తెలిపారు. ఈ విషయంలో తనను ఇరికించాలనే కేసీఆర్ పథకం వేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే ధనిక సీఎం, ధనిక పార్టీగా బీఆర్ఎస్ అవతరించిందని పేర్కొన్నారు. 8 సంవత్సరాల్లో వేల కోట్లు కేసీఆర్‌కి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంట్రాక్టులు, ఇసుక, మద్యం దందాలతో దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. అసైన్డ్ భూములు దోచుకుని స్థిరాస్తి దందా చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో దందాలపై చర్చ జరగకుండా ఉండాలనే తమపై కేసులు పెడుతున్నారని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా మొక్కవోని దీక్షతో బీఆర్ఎస్ పోరాడుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.