Mp Arvind on Jangareddy: తెలంగాణలో అంకితభావంతో పనిచేసే నేతలు కరవైయ్యారని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. గడిచిన 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో హుందాతనం కనిపించడం లేదన్నారు. 1984లో భాజపాకు ఇద్దరు ఎంపీలు ఉండగా.. అందులో జంగారెడ్డి ఒకరని అర్వింద్ గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును.. జంగారెడ్డి ఓడించారని చెప్పారు. భాజపా ఓ సీనియర్ నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి దేశానికి, పార్టీకి ఎంతో సేవచేశారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ కొనియాడారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి వరంగల్లోని జంగారెడ్డి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. జంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
'1984లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును ఓడించి.. జంగారెడ్డి చరిత్ర సృష్టించారు. జీవితాంతం.. పార్టీ, దేశానికి సేవ చేశారు. జంగారెడ్డి మరణించారని తెలిసి.. ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేయడానికి వచ్చా.'
- రామ్మాధవ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి