తెలంగాణ

telangana

ETV Bharat / state

మొన్న మధుళిక.. నేడు రవళి

నాకు దక్కని అమ్మాయి ఇంకెవరకీ దక్కకూడదని కొందరు ఉన్మాదులుగా మారుతున్నారు. ప్రేమించానని వెంటపడ్డవాళ్లే.. చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. మొన్న మధులిక, ఇవాళ రవళిపై జరిగిన దాడులతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అసలు ప్రేమంటే ఇదేనా..?

By

Published : Feb 27, 2019, 4:17 PM IST

నిందితుడు

రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు
ప్రేమోన్మాదులు బరితెగిస్తున్నారు. ఆడపిల్ల ఒంటరిగా రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడే రోజులొచ్చాయి. మొన్న మధులిక, నేడు రవళిపై దాడులే ఇందుకు ఉదాహరణ. కాలేజీకి వెళ్లిన కూతురు క్షేమంగా ఇంటికొస్తుందో లేదోనని తల్లిదండ్రులు క్షణక్షణం ఆందోళన చెందుతున్నారు. ఏ ఉన్మాది కర్కశత్వానికి బలైపోతారోనన్న భయం వెంటాడుతోంది.

వరంగల్​ అర్బన్​ జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వరంగల్​ గ్రామీణ జిల్లా రామచంద్రపురానికి చెందిన రవళి హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో చదువుతోంది. అక్కడే చదువుతున్న అన్వేష్​ ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. నిరాకరించిందని పగ పెంచుకున్నాడు.ఎలాగైనా అంతమొందించాలని పథకం పన్నాడు.ఆమె రోజు కళాశాలకొచ్చే దారిలో కాపుకాశాడు. తనతో తెచ్చుకున్న పెట్రోలును పోసి నిప్పంటించాడు.

పథకం ప్రకారమే ఘాతుకం

అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగిపోయింది. క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. ఒళ్లంతా కాలిపోతుంటే కాపాడాలని రవళి ఆర్తనాదాలు చేసింది. రక్షిద్దామని ముందుకొచ్చిన వారిని బెదిరించాడా దుర్మార్గుడు. 80శాతం కాలిన గాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం రవళి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

దాడి అనంతరం నిందితుడు పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళినిపోలీస్​ కమిషనర్​ రవీందర్​ పరామర్శించారు. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించిన కారణాలను న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. ప్రేమించినవాళ్లు ఎక్కడున్న సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అంతేకానీ..చావడమో..లేదంటే చంపడమో ఎందుకు. ఒక్కసారి ఆలోచించండి.

ABOUT THE AUTHOR

...view details