వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మంజూరైన రెండు పడకల గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆదేశించారు. స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న భద్రకాళి ట్యాంక్ బండ్ సుందరీకరణ, రూ.65 కోట్లతో చేపట్టిన 11 స్మార్ట్ రోడ్డు పనులు... 8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 4 నగర ఆహ్వాన ముఖ ద్వారాల పనులతో పాటు నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
'వరంగల్ స్మార్ట్‌సిటీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి' - తెలంగాణ తాజా వార్తలు
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో వరంగల్ బృహత్తర ప్రణాళిక విడుదల చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. వరంగల్ మహానగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆర్అండ్బీ అతిథి గృహంలో సమీక్షించారు.
వరంగల్ మహానగరంలో టౌన్షిప్, క్రీడా మైదానాలు, లాజిస్టిక్ హబ్, వినోద హంగులు, నర్సరీల అభివృద్ధి కోసం ఇప్పటికే 155 ఎకరాల స్థలాన్ని ల్యాండ్ పూలింగ్ చేశారని మంత్రి తెలిపారు. దానితోపాటు మరికొంత ల్యాండ్ పూలింగ్ చేయడం ద్వారా నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. నగరంలో రూ.600 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరలోనే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.