దుబ్బాక ఉపఎన్నికలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఓటమి చూశామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టి గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందారని భాజపా నేతలను విమర్శించారు. ఓరుగల్లు ప్రజలు తెరాసకు మద్దతుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మీరు పాలించే రాష్ట్రాల్లో ఈ పథకాలున్నాయా? : ఎర్రబెల్లి - minister errabelli dayakar rao
భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. కాషాయ నేతలు కేసీఆర్‌పై నిందలు మోపుతున్నారని ఆరోపించారు.
కేంద్ర నిధులు అవసరం లేకుండా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
వరంగల్ నగరంలోని రామన్నపేట ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన డివిజన్ కార్యకర్తల సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.