ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వడగండ్ల వానలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో వందల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పైరు నేలకొరిగింది. ఈదురు గాలులకు వరి కంకులకు ఉన్న గింజలు నేలరాలాయి. పంట కోసి కల్లంలో ఆరబెట్టిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా శ్రమించి తడిసిన ధాన్యాన్ని ఆరబెడితే రాత్రి మళ్లీ వర్షం కురిసి తడిసి పోతోందని వాపోయారు. ధాన్యపు రాశులపై టార్పాలిన్ కవర్లను కప్పి తడవకుండా చర్యలు తీసుకున్నప్పటికీ... విపరీతమైన గాలులకు ఆ కవర్లు ఎగిరి పోతున్నాయని తెలిపారు.
తడిసిన ధాన్యానికి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. అకాల వర్షంతో కౌలు రైతుల పరిస్థితి మరింత దీనంగా మారింది. భూమి యజమానికి చెల్లించవలసిన కౌలుతో పాటు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా నష్టపోవాల్సి వస్తోందని బాధపడుతూ తెలిపారు.