వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామంలో సేంద్రీయ పద్ధతిలో మల్బరీ పంటను సాగుచేస్తూ.. పట్టు పురుగుల పెంపకం ద్వారా అధిక దిగుబడిని పొందుతున్నారు అంబాల ప్రతాప్ అనే రైతు. తనకున్న ఎకరం వ్యవసాయ భూమిలో పద్నాలుగేళ్లుగా రసాయనిక ఎరువులతో మల్బరీ పంటను పండిస్తూ, పట్టుపురుగుల పెంపకాన్ని చేస్తున్నారు. ఆ విధానంలో పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో తన స్నేహితుడైన షేక్ హుస్సేన్ను సంప్రదించారు. మిత్రుడి సూచనల మేరకు గతేడాది నుంచి సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్నారు. దీంతో పంట దిగుబడి గణనీయంగా పెరిగి లాభాలు వస్తున్నట్లు రైతు ప్రతాప్ తెలిపారు.
అధిక దిగుబడి
ఈ విధానం ద్వారా 20 శాతం అధిక దిగుబడి వస్తున్నట్లు రైతు పేర్కొన్నారు. జీవామృతం, ద్రవ జీవామృతాలను మొక్కలకు పట్టిస్తూ, ఆకులు వచ్చిన తర్వాత వాటిని పురుగులు తినకుండా వేప కషాయం, పుల్ల మజ్జిగను ఆకులపై పిచికారీ చేస్తున్నట్లు వివరించారు. నాణ్యతగా వచ్చిన ఈ మల్బరీ ఆకులను పట్టుపురుగులకు మేతగా వేయడం వల్ల పురుగులు బలంగా తయారయ్యాయని చెప్పారు. ఇంతకుముందు రసాయనిక పద్ధతుల ద్వారా 100 గుడ్లకు 50 కిలోల పట్టు గూళ్ల దిగుబడి రాగా.. సేంద్రీయ పద్ధతి ద్వారా 100కు 70 నుంచి 80 కిలోల వరకు అధికంగా వస్తోందని ప్రతాప్ హర్షం వ్యక్తం చేశారు.