Mahashivratri celebrations in Telangana : మహాశివరాత్రిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసివచ్చి శివరాత్రి వేళ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మల్లన్న నామస్మరణలు జయ జయ నాదాల నడుమ ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో అలరారుతోంది.
Mahashivratri in Vemulawada temple : మల్లన్న ఆలయంలో మధ్యాహ్నం 1గంటలకు ఒగ్గు పుజారులచే పెద్ద పట్నం నిర్వహించనున్నారు. రాత్రి 8గంటలకు నంది వాహనసేవ అనంతరం స్వామి వారి కళ్యాణం రాత్రి 11సమయంలో మహాన్యాస పూర్వక అష్టోత్తర రుద్రాభిషేకం నిర్వహించనున్న ఆలయ ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ శర్మ తెలపగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి భట్టి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పచ్చల, ఛాయా సోమేశ్వరాలయంలో రుద్రాభిషేకాలు, శివలింగానికి పూలు, పాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు.
యాదాద్రి మహాపుణ్యక్షేత్రంలో పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం సకల దేవతలు, సప్తరుషుల సమక్షంలో ఘనంగా జరిగింది. నిత్యహవనం, పంచసూక్త పఠనం, మూలమంత్ర జపం, శివపంచారీక్షరీ, నందీశ్వర పారాయణం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ లింగేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. MLAశానంపూడి సైదిరెడ్డి దంపతులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.